బీటెక్ స్టూడెంట్ హత్యపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్

బీటెక్ స్టూడెంట్ హత్యపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్

న్యూఢిల్లీ: బీటెక్ విద్యార్థిని రమ్యను పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా హత్య జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేశాశర్మ స్పందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లెటర్ రాశారు. బీటెక్ స్టూడెంట్ ను చంపిన ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు భద్రతపై నమ్మకం కల్పించేందుకు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని సూచించారు. 
గుంటూరులో పట్టపగలు బీటెక్ స్టూడెంట్ ను వేధించి ఆమె వినకపోతే కత్తితో పొడిచి చంపిన శశికృష్ణ (24)ను పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల రాకను పసిగట్టి నిందితుడు కత్తితో గాయపరచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా పోలీసులు చాకచక్యంగా దృష్టి మళ్లించి దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతడు కత్తితో చేతికి గాయం చేసుకోవడంతో పోలీసులు వైద్య పరీక్షలు చేయించి గుంటూరు ఆస్పత్రికి తరలించి అక్కడ అన్ని వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నిన్న మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుడు శశికృష్ణ స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం.