
టాలీవుడ్ తోపాటు బాలీవుడ్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ నేషనల్ క్రష్ గా గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే రష్మికను కన్నడ సినీ పరిశ్రమ నిషేధించిందనే వదంతులు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ ఊహాగానాలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ముఖ్యంగా.. తన కెరీర్‌ను ప్రారంభించిన దర్శకుడు రిషబ్ శెట్టికి, ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార'కు రష్మిక దూరంగా ఉన్నారనే విమర్శలకు ఆమె సమాధానమిచ్చారు.
'కాంతార'పై స్పందన ఆలస్యంపై వివరణ..
2016లో రష్మికను సినీ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం 'కిరిక్ పార్టీ'. దీనికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే, రిషబ్ శెట్టి సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమా గురించి రష్మిక ఆలస్యంగా స్పందించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయమై పాత ఇంటర్వ్యూ ఒకటి లేటెస్ట్ గా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్అవుతోంది. సినిమా విడుదలైన తొలి రెండు మూడు రోజుల్లో నేను 'కాంతార' చూడలేదు. కానీ, తర్వాత చూశాను. వెంటనే చిత్రబృందానికి సందేశం కూడా పంపాను. వారు 'ధన్యవాదాలు' అని బదులిచ్చారు కూడా అని రష్మిక తెలిపారు.
ALSO READ : అఫీషియల్.. నెట్ఫ్లిక్స్లో ఎన్టీఆర్ ‘వార్ 2’..
వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి తెలియవు..
సినీ ప్రముఖులుగా తమ జీవితంలో తెర వెనుక ఏం జరుగుతుందో ప్రపంచానికి పూర్తిగా తెలియదని రష్మిక స్పష్టం చేశారు. లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. మా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ కెమెరాలో రికార్డ్ చేయలేం కదా. అంతేకాకుండా, మేము మా మెసేజ్‌లను, వ్యక్తిగత సంభాషణలను ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తులం కాము. అందుకే ఒక వ్యక్తి జీవితం గురించి బయటివారు చెప్పే మాటలు పట్టించుకోనవసరం లేదు. కానీ మా వృత్తిపరమైన జీవితం గురించి వారు చెప్పే విమర్శలను తప్పకుండా పరిగణించి సమాధానం ఇస్తామని ఆమె స్పష్టం చేశారు.
నన్ను ఎవరూ నిషేధించలేదు..
కన్నడ సినీ పరిశ్రమ నుంచి నిషేధం గురించి వస్తున్న వార్తలపై రష్మిక నవ్వుతూ.. ఇప్పటివరకు, నన్ను ఎవరూ నిషేధించలేదు. అవన్నీ అవాస్తవాలు.. ఇవి ఫేక్ వార్తలు మాత్రమే అని తేల్చి చెప్పారు. కళాకారులుగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జీవించలేమని, విమర్శలు తరచుగా అపార్థాలు , అసంపూర్ణ జ్ఞానం నుంచే వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. నాకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఉన్నారని .. ఉంటుందని చెప్పుకోచ్చారు.
విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం..
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. రష్మిక తన ప్రియుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ఊహాగానాలపై ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. వృత్తిపరంగా రష్మిక చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ‘తమ్మ’ (Thamma) లో నటిస్తున్నారు. ఆదిత్య సర్‌పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, మ్యాడ్‌డాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU) లో ఐదవ భాగం. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, వరుణ్ ధావన్, నోరా ఫతేహి, మలైకా అరొరా వంటి ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.