ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ వంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్ వంటి అగ్ర నటులతోనూ కలిసి నటించి మెప్పించింది. కానీ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ తో మాత్రం ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ఈ క్రమంలో రష్మిక సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ గామారింది.
త్వరలోనే ప్రభాస్ తో కలిసి నటిస్తా..
లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక ప్రశ్నోత్తరాల (Q&A) సెషన్‌లో.. ఒక అభిమాని రష్మికను 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం ఉందా?' అని అడిగాడు. దానికి రష్మిక ప్రభాస్ తో కలిసి నటించాలనే తన మనసులోని మాటను, ఆసక్తిని తెలిపింది. ఎంతో ఉత్సాహంగా 'ఐ లవ్ ఇట్. ప్రభాస్ సర్ ఈ మెసేజ్ చూస్తారని అనుకుంటున్నా.. త్వరలోనే మేమిద్దరం కలిసి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని రష్మిక సమాధానమిచ్చారు.
రష్మిక ఆశ ఫలించేనా?
రష్మిక ప్రకటన అభిమానుల అంచనాలను, ఉత్సాహాన్ని అమాంతం పెంచేసింది. ఎందుకంటే ప్రభాస్ - రష్మిక కాంబినేషన్ గురించి గత కొంతగాలంగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వినిపించాయి. ఈ చర్చలు దాదాపు కొలక్కివచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇప్పుడు రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు, 'స్పిరిట్' లేదా మరే ఇతర పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో అయినా వీరిద్దరూ కలిసి పనిచేసే అవకాశాలను బలంగా సూచిస్తున్నాయి.
బిజీ షెడ్యూల్స్
ప్రస్తుతం రష్మిక 'తమ్మా' సినిమా విజయంతో ఫుల్ జోరు మీదున్నారు. నవంబర్ 7న ఆమె నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్‌ఫ్రెండ్' గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి . దీనితో పాటు, ఆమె తన 'రూమర్డ్ ఫ్యాన్సీ' విజయ్ దేవరకొండతో కలిసి చేయబోయే 'VD14' షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మరో ఆసక్తికర చిత్రం ఇది. మరోవైపు ప్రభాస్ సైతం ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ 'ది రాజాసాబ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో 'సలార్ 2', సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్' వంటి బడా ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఈ ఇద్దరు అగ్ర తారలకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. వీరిద్దరి కలయిక నిజమైతే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రష్మిక ఆశించినట్లుగా ప్రభాస్ ఆమె సందేశాన్ని గమనించి, త్వరలోనే ఈ కలయికను నిజం చేస్తారని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
