శ్రీశైలం డ్యాం భద్రతపై ఆరా

శ్రీశైలం డ్యాం భద్రతపై ఆరా

శ్రీశైలం,వెలుగు : రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీశైలం వచ్చిన నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ, కేఆర్​ఎంబీ టీమ్స్​ డ్యాం భద్రతపై ఆరా తీశాయి. ఎన్డీఎస్ఏ చైర్మన్  వివేక్  త్రిపాఠి, టెక్నికల్​ మెంబర్​ రాకేశ్  కశ్యప్, కేఆర్ఎంబీకి సంబంధించిన 10 మంది సభ్యులు గురువారం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్​కు చేరుకున్నారు. రిజర్వాయర్​ను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేయనున్నది.

ఈ సందర్భంగా గురువారం రిజర్వాయర్​భద్రత, నీటి నిల్వలు, నీటి వినియోగం తదితర వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2009 వరదలపై అధికారులతో చర్చించి, డయాగ్రామ్స్ పరిశీలించారు. డ్యామ్ గేట్లు, గ్యాలరీ, రోప్స్, డ్యామ్  ముందు ఏర్పడిన ప్లాంజ్ పూల్(పెద్ద గొయ్యి) గురించి ఆరా తీశారు. డ్యామ్ ముందున్న గేట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు.

పరిశీలన పూర్తయిన తర్వాత డ్యామ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్ట్​ సీఈ కబీర్ బాషా మాట్లాడుతూ తమ బృందం డ్యామ్ స్థితిగతులు, ఇబ్బందులు అడిగి తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించిందని చెప్పారు. ప్లాంజ్ పూల్ పరిస్థితి పరిశీలించి, గొయ్యి లోతు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. మూడు గ్యాలరీలు పరిశీలించి, సీపీసీ, డ్యామ్  గేట్ల ఆపరేటింగ్ ని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అప్రోచ్ రోడ్డు, సిలికాన్  సిలిండర్ గురించి గతంలోనే ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రపోజల్స్​అందించామన్నారు. ప్రపంచ బ్యాంకుకు రిపేర్ల కోసం రూ.135 కోట్ల అంచనాతో ప్రపోజల్స్​ పంపించామని, ఎన్డీఎస్ఏ టీమ్​సూచనలతో మరోసారి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి డ్యామ్​కు ఇబ్బంది లేదని, ప్లాంజ్ పూల్, చిన్నచిన్న రిపేర్లపై నిపుణుల బృందం కొన్ని సలహాలు చేసిందని సీఈ చెప్పారు. డ్యామ్  ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, ఇంజినీర్లు పాల్గొన్నారు.