సోనియా, రాహుల్పై కొత్త ఎఫ్ఐఆర్.. నేషనల్ హెరాల్డ్ కేసులో నమోదు చేసిన ఢిల్లీ ఈవోడబ్ల్యూ

సోనియా, రాహుల్పై కొత్త ఎఫ్ఐఆర్.. నేషనల్ హెరాల్డ్ కేసులో నమోదు చేసిన ఢిల్లీ ఈవోడబ్ల్యూ
  • ఈడీ సమాచారంతో నేరపూరిత కుట్ర అభియోగాలు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. శామ్ పిట్రోడా సహా మరో ముగ్గురు వ్యక్తులు, మూడు కంపెనీలు (ఏజేఎల్, యంగ్ ఇండియన్, డాటెక్స్) పేర్లను ఢిల్లీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈవోడబ్ల్యూ) ఎఫ్ఐఆర్​లో చేర్చింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన సమాచారంతో వారిపై నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్టు ఢిల్లీ ఈవోడబ్ల్యూ పోలీసులు తెలిపారు. ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలతో పాటు యాంగ్ ఇండియా సంస్థ కూడా మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపించింది. 

వీరందరూ కుట్రపూరితంగా రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) కు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని వెల్లడించింది.  నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న ఏజేఎల్ కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని స్వాధీనంలోకి తీసుకుంది. 

రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి రూ.50 లక్షలను కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ ను సొంతం చేసుకున్నట్టు ఈడీ అభియోగపత్రం మోపింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు డిసెంబర్ 16కు వాయిదావేసింది.