నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదుకోవాలె : కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్

నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదుకోవాలె : కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ర్టం ఆగమైందన్నారు జాతీయ కిసాన్ కాంగ్రెస్ సెల్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్ ఖైరా. వర్షాలకు 60 మంది వరకు చనిపోయారని, లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి పంటకు ఎకరానికి రూ. 20 వేల చొప్పున సాయం చేయాలని కోరారు. ఎకరా పత్తి పంటకు రూ.15 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ.10 వేల చొప్పున సాయం చేయాలని డిమాండ్ చేశారు. పంటపొలాల్లో ఇసుక మేటలను తొలగించడానికి ఎకరాకు రూ.50 వేల సాయం అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇండ్లు కోల్పోయిన వారికి రూ.5 ఐదు లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి లక్ష రూపాయల సాయం చేయాలని కోరారు. చనిపోయిన పశువుల యజమానులకు (ఒక్కొక్క పశువుకు) రూ.65 వేల సాయం చేయాలన్నారు. 

రుణమాఫీ చేయడంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్ ఖైరా. పంజాబ్ రైతులకు ఆదుకోవడానికి అక్కడ రైతు నిధిని ఏర్పాటు చేశామన్నారు. వరదల్లో నష్టపోతే రైతు నిధి నుండి సాయం చేస్తామన్నారు. బీఆర్ఎస్ సర్కార్.. ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం లేదన్నారు. రైతుల అంశాలు కాకుండా ఇతర అంశాలపైనే ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టిపెడుతున్నాయని చెప్పారు. బీజేపీ పూర్తిగా వ్యాపారుల పార్టీగా మారిందన్నారు. రైతుల పట్ల ఆలోచన చేసే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కాంగ్రెస్ మేనిఫెస్టో రైతు ఎజెండాగా ఉంటుందన్నారు. దళారీ దందా లేకుండా చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు భరోసా కల్పించడానికి రైతు నిధి కింద రూ.10 లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.