నిర్మల్, వెలుగు: జాతీయ స్థాయిలో నిర్వహించిన చాంపియన్‌షిప్ పోటీల్లో బాసర ట్రిపుల్‌ఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల ‘టీమ్ గరుడ’ సత్తా చాటింది.
మార్చి 27 నుంచి 31 వరకు నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా 55 జట్లు పాల్గొనగా.. టీమ్ గరుడ డిజైన్ ఇంజనీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు అహ్మదాబాద్‌లోని మోనార్క్ యూనివర్సిటీలో నిర్వహించిన ఏటీవీసీ ఇండియా 2026 పోటీల్లో 43 జట్లు పోటీపడగా.. ‘గరుడ’ రెండు అవార్డులు సొంతం చేసుకుంది.
డిజైన్ ఎవాల్యుయేషన్ విభాగంలో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ (విన్నర్)తో పాటు 'బెస్ట్ మోటివేటెడ్ టీమ్' అవార్డు కూడా గెలుచుకుంది. ఈ విజయాలపై వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విద్యార్థుల అంకితభావానికి, క్రియేటివిటికి నిదర్శనమన్నారు.
ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ.. ప్రయోగాత్మక అభ్యాసం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులను అసోసియేట్ డీన్‌లు డాక్టర్ కె. మహేశ్, శేఖర్ శీలం, డాక్టర్ ఎస్. విట్టల్, మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఎ. చరణ్ రెడ్డి అభినందించారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు అన్పత్ రాహుల్, డాక్టర్ కె. మహేశ్ విద్యార్థుల కృషిని ప్రశంసించారు.
