- పోటీలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: ఈ నెల 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ నేషనల్ లెవల్ ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఆయిల్, సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. 11న సాయంత్రం 4 గంటలకు పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.
కాజీపేట రైల్వే స్టేడియంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారి జాతీయ స్థాయి సీనియర్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ విభాగాల నుంచి 40 పురుషుల జట్లు, 39 మహిళా జట్లు పాల్గొంటాయని తెలిపారు.
పోటీలకు 2 వేల మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, ఇతర ఆఫీసర్లు హాజరవుతారని చెప్పారు. పోటీలను పగలు, రాత్రి నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్స్, 4 సింథటిక్ కోర్టులు, 2 క్లే కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులతో పాటు అధికారులకు అన్ని సౌలతులు కల్పిస్తున్నామని చెప్పారు.
అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కైలాస్ యాదవ్, నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షుడు కుసుమ సదానందం, జాయింట్ సెక్రటరీ ఎం.రమణ, రాజారపు రమేశ్ పాల్గొన్నారు.
