ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం పెట్టాలె

ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం పెట్టాలె
  • ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం పెట్టాలె
  •     5 ఎకరాల్లో స్మారక  మ్యూజియం నిర్మించాలి
  •     మాల మహానాడు డిమాండ్


హైదరాబాద్, వెలుగు:  ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ర్ట అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు.  గద్దర్ మృతి తీరని లోటని, ఆయన యుగ పురుషుడని అన్నారు. బుధవారం ట్యాంక్ బండ్ దగ్గర గద్దర్ కు మాల మహానాడు నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ..గద్దర్ పేరుతో 5 ఎకరాల్లో స్మారక మ్యూజియం ఏర్పాటుతో పాటు, ఆయన పేరుతో అవార్డు ఏర్పాటు చేసి కవులు, కళాకారులకు ఇవ్వాలన్నారు.  సాంస్కృతిక సారధికి గద్దర్ పేరు పెట్టాలని..ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లోనూ చేర్చాలని కోరారు. గద్దర్ స్ఫూర్తితో ఓటు చైతన్య ఉద్యమాన్ని మాల మహానాడు చేపట్టనున్నట్లు సుధాకర్ వెల్లడించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్ మాట్లాడుతూ.. గద్దర్ అంతిమ యాత్రకు వచ్చిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మరణం ప్రజా స్వామిక ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. 

గద్దర్ చుట్టూ రాజకీయ విష వలయం: ధర్మార్జున్ 

గద్దర్ చుట్టూ రాజకీయ విష వలయం చుట్టడం సరైనది కాదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు. గద్దర్ పట్ల నాయకుల బాధ్యతారహితమైన ప్రవర్తన ప్రజలను కలచి వేస్తున్నదని తెలిపారు. గద్దర్ తన జీవితకాలం ప్రజల పక్షాన నిలబడి పాలకవర్గ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని బుధవారం ఒక ప్రకటనలో  గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఎన్నికల అవకాశవాద దోరణులను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమంలోనే కొనసాగాడని చెప్పారు. మొదటి నుంచి కేసీఆర్ విధానాలను నిరసిస్తూనే ఉన్నాడన్నారు. ఇటీవల టీజేఎస్ నిర్వహించిన  తెలంగాణ బచావో సదస్సులోనూ గద్దర్ పాల్గొన్నారని.. కేసీఆర్ ను గద్దె దింపేంతవరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారని ధర్మార్జున్  పేర్కొన్నారు.