సెప్టెంబర్ 1 నుంచి జాతీయ పోషకాహార వారోత్సవాలు..పోషకాహారంతోనే ఆరోగ్య సౌభాగ్యం

సెప్టెంబర్ 1 నుంచి జాతీయ పోషకాహార వారోత్సవాలు..పోషకాహారంతోనే ఆరోగ్య సౌభాగ్యం

ఆరోగ్యమే  మహాభాగ్యం.  ఆరోగ్యానికి  మించిన  సంపద లేదు.  పోషకాహారమే మన ఆరోగ్యానికి పునాది.   మనం తినే ప్రతి ఆహార పదార్థం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పోషకాహారం తీసుకున్నపుడు ఆరోగ్యభాగ్యం, చెడు ఆహారం తీసుకున్నపుడు రోగం కలుగుతుంది.  ప్రజారోగ్యానికి పోషకాహారమే ఆధారంగా నిలుస్తుంది. 

అనారోగ్యాలు కుటుంబాల ఆర్థికప్రగతికి ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. ఆరోగ్యకర పౌర సమాజమే జాతి సమగ్రాభివృద్ధికి వెన్నెముక.  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి పోషకాహార లోపాలు శాపంగా మారుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, అవిద్య, అవగాహనలేమి లాంటివి పోషకాహారలోప సమస్యలకు కారణం అవుతున్నాయి. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎదుగుతున్న భారతదేశంలో  పోషకాహార లోపాలు బెడద అధికంగా కనిపిస్తున్నది. 

ఈట్‌‌‌‌ రైట్‌‌‌‌ ఫర్ ఏ బెటర్ లైఫ్

ప్రజలకు పోషకాహార విలువలను వివరించడానికి, పోషకాల పట్ల అవగాహన కల్పించడానికి, జీవనశైలి మార్పులను సూచించడానికి, పోషక విలువ గురించి తెలపడానికి ప్రతి ఏటా  సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు  ‘జాతీయ పోషకాహార వారోత్సవాలు(నేషనల్ న్యూట్రిషన్ వీక్‌‌‌‌) పాటించడం కొనసాగుతున్నది. 1975లో అమెరికాలో ప్రారంభమైన జాతీయ పోషకాహార వారోత్సవాలను 1982లో భారత మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ కూడా ఆచరించాలని నిర్ణయించింది. 

ఈ వారోత్సవాల్లో భాగంగా ఆరోగ్యంపట్ల అవగాహన,  జీవన విధానం, పరిసరాల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, పోషకాహారలోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు లాంటి అంశాలను ప్రచారం చేయడం జరుగుతోంది. 2025 జాతీయ పోషకాహార వారోత్సవాల ఇతివృత్తంగా  ‘ఈట్‌‌‌‌ రైట్‌‌‌‌ ఫర్ ఏ బెటర్ లైఫ్ (పోషకాహారం తినడం వల్ల ఆరోగ్యకర జీవితం)’ అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతోంది. 

భారత్‌‌‌‌లో పోషకాహార సమస్య

అధిక జనాభా, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత  కలిగిన దేశంలో పోషకాహార సమస్యలు ఉత్పన్నం కావడం సర్వసాధారణం.  తినడానికి రెండు పూటల తిండి దొరకడమే కష్టం అయినప్పుడు పోషకాహార లభ్యత కష్టమే. 

రెండు ముద్దల పచ్చడి మెతుకులు తినడానికి అలవాటు పడిన అధికసంఖ్యలో జనానికి ఆరోగ్య సమస్యలు రావడం అతి సహజమే. ఎంత తిన్నాం అనేదానికంటే ఏం తిన్నామన్నదే ప్రధానమని తెలుసుకోవాలి. మనం తినే ఆహారంలో స్థూల సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఆరోగ్యకర కొవ్వులు ఉండేవిధంగా జాగ్రత్త పడితేనే కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. మనం తినే ప్లేటులో అధికంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉండేవిధంగా చూసుకోవాలి.  

నేటి పోషకాహారమే రేపటి ఆరోగ్య ప్రదాయిని

పోషకాహార  లోపంతో పిల్లల శారీరక ఎదుగుదల కుంటుపడుతుంది. . 2025 గణాంకాల ప్రకారం 6 ఏండ్లలోపు పిల్లల్లో 38 శాతం సాధారణ ఎత్తు పెరగకపోవడం, 19 శాతం తక్కువ బరువును కలిగి ఉండడం గమనించారు. 

ఈ తీవ్ర పోషకాహార లోప సమస్యలకు విరుగుడుగా భారత ప్రభుత్వం పోషన్‌‌‌‌ అభియాన్‌‌‌‌, ఐసిడిఎస్‌‌‌‌(సమీకృత శిశు అభివృద్ధి పథ), మధ్యాహ్న భోజన పథకం లాంటివి అమలు చేస్తున్నాయి.  జాతీయ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోషకాహార సంబంధ పోటీల నిర్వహణ, వైద్యులచే కార్యశాలలు, వైద్య శిబిరాలు, డిజిటల్‌‌‌‌ ఆధార్ ప్రచారాలు, పౌర సమాజాన్ని జాగృత పరిచే కార్యక్రమాలు లాంటివి నిత్యం నిర్వహించాలి. 

-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-