సెప్టెంబర్ 4 నుండి 7 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు

సెప్టెంబర్ 4 నుండి 7 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు

బీజేపీ వ్యతిరేక శక్తులను సీఎం కేసీఆర్ కలవడాన్ని తాము అభినందిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్,  కేసీఆర్ ఇద్దరు దోస్తులేనని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు వైఎస్ జగన్ ను కూడా కేసీఆర్ కలవాలని కోరారు. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విషయంలో కొండను తవ్వి ఎలుకను తీసినట్లు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని సెటైర్ వేశారు. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాతో భేటీ కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 
 
బీజేపీ ఆటలు సాగనీయం
సెప్టెంబర్ 4 నుండి 7వ తేదీ వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ గురించి మహాసభల్లో చర్చిస్తామన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, ఆ పార్టీ ఆటలు రాష్ట్రంలో సాగనీయమని చెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్దిదారులకు కేటాయించాలని కోరారు. బాసర త్రిబుల్ ఐటీలో జరిగిన సంఘటనలపై రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. త్రిబుల్ ఐటీలో కాంట్రాక్టర్ ను వెంటనే తొలగించి.. రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేశారు.