‘అగ్నిపథ్’పై వెనక్కి తగ్గేదే లే : అజిత్ దోవల్

‘అగ్నిపథ్’పై వెనక్కి తగ్గేదే లే : అజిత్ దోవల్

న్యూఢిల్లీ : అగ్నిప‌థ్ రిక్రూట్‌మెంట్ పథకంపై నిర‌స‌న‌లు మిన్నంటిన నేప‌థ్యంలో అగ్నివీరుల భ‌విష్యత్‌కు ఢోకా ఉండ‌ద‌ని, ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ భ‌రోసా ఇచ్చారు. రెగ్యుల‌ర్ స‌ర్వీసులోకి తీసుకునే అగ్నివీరుల‌కు క‌ఠోర శిక్షణ ఉంటుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభ‌వం సాధిస్తార‌ని చెప్పారు. అగ్నివీరుల భ‌విష్యత్ పూర్తిగా భ‌ద్రమేన‌ని హామీ ఇచ్చారు. అగ్నిప‌థ్ స్కీంను స‌మ‌ర్ధించిన అజిత్ దోవ‌ల్ యువ‌, సుశిక్షిత సేన‌లు సైన్యానికి అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌పై అజిత్ దోవ‌ల్ ఆందోళ‌న వ్యక్తం చేశారు.

విధ్వంసం, హింసాకాండ‌ను ఎట్టి ప‌రిస్ధితుల్లోనూ ఉపేక్షించేది లేద‌ని అజిత్ దోవల్ హెచ్చరించారు. అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల వెనుక కొంతమంది స్వార్ధ ప్రయోజనాలు దాగున్నాయ‌ని, స‌మాజంలో చిచ్చు పెట్టాల‌నే ఉద్దేశంతోనే అగ్నిప‌థ్‌ను వ్యతిరేకిస్తున్నార‌ని ఆరోపించారు. హింసాకాండ‌ను ఎవ‌రూ స‌మ‌ర్ధించుకోలేర‌ని అన్నారు. అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల‌పై స్పందిస్తూ హింసాత్మక నిర‌స‌న‌ల విష‌యంలో నిందితుల‌ను గుర్తించార‌ని, దీనిపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రుగుతుంద‌ని చెప్పారు. అగ్నిపథ్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ ప్రయోజనాల కోసం రిస్క్ తీసుకున్నారని చెప్పారు. ఈ పథకం భారతదేశం భవిష్యత్తుకు భద్రంగా ఉంటుందన్నారు. 

నూతనంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు రైతులందరూ నిరసనలు, ఆందోళనలు చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గిందని, అయితే.. అగ్నిపథ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నారు. ఈ పథకంపై ఒకరోజు, రెండు రోజులు చర్చించి తీసుకున్న నిర్ణయం కాదని, గత కొన్నేళ్లుగా నిపుణులు, రిటైర్డ్ ఆర్మీ కమిటీలు, మంత్రుల ప్యానెల్ లతో వివిధ దశల్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే.. సాయుధ బలగాల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.  ఈ పథకం పై సమస్య ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారని, అయితే.. దేశ ప్రయోజనాల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం, గొప్ప సంకల్పం ఎవరికీ లేదని, అది కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాలు, భవిష్యత్తు కోసమే అగ్నిపథ్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. 

ఇదే స్కీమ్ గురించి 2006లో - కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి (యూపీఏ ) అధికారంలో ఉన్నప్పుడు - రక్షణ మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని చెప్పారు. సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, అయితే దాని నివేదిక ఎప్పుడూ బయటకు రాలేదని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చారు. 

త్రివిధ దళాధిపతుల సమక్షంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ప్రకటించిన ఈ పథకంలో 17న్నర నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులు మరియు మహిళలను నియమించుకోవచ్చు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్ జరగనందున కేంద్రం ఈ సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పొడిగించింది. ఈ మూడు సర్వీసుల్లో ఈ ఏడాది దాదాపు 45,000 మంది సైనికులను నియమించుకోవాలనేది ప్రణాళిక. వచ్చే నెలలో రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని ఇండియన్ ఆర్మీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది.

భార‌త సైనిక దళాల్లో నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్‌ రాజేసిన అగ్గి కార్చిచ్చుగా మారి దేశంలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలకు దారితీసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు తారస్థాయికి చేరాయి. రైల్వేస్టేషన్లను ముట్టడించడంతో పాటు హైవేలను దిగ్బంధించారు. 

దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీమ్‌ను కేంద్ర ర‌క్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవ‌లే ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. 2023 జూలై నాటికి అగ్నిప‌థ్ స్కీమ్ కింద దేశంలోని 45 వేల మంది యువతను ర‌క్షణ ద‌ళంలోకి తీసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్నట్టు తెలిపారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వ‌య‌సులోపు వారే దీంట్లో ఉంటారు. ఆర్మీలో యువ‌త‌ను తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రవేశ‌పెట్టారు. కొత్త టెక్నాల‌జీతో యువ‌త‌కు శిక్షణ ఇచ్చి.. వారి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచేందుకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్ల పాటు యువ‌త‌ను భార‌త త్రివిధ ద‌ళాల్లో జాయిన్ చేసుకోవ‌డ‌మే ప్రధాన ఉద్దేశం. ఈ ప‌థ‌కం కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు.

శిక్షణ ఇలా..
ఎంపికైన వారికి 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది. నాలుగేళ్ల త‌ర్వాత కేవ‌లం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్రమే 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్లకు 12 ల‌క్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్లకు పెన్షన్ బెనిఫిట్ ఉండ‌దు.

నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌..
అగ్నిపథ్  పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. తొలిబ్యాచ్‌ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది.

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి. 

అగ్నిపథ్​ నోటిఫికేషన్​ విడుదల

అగ్నిపథ్​ మిలిటరీ రిక్రూట్​మెంట్​ స్కీమ్​ కింద జవాన్ల నియామకానికి సంబంధించి ఆర్మీ సోమవారం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్​ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్​మెంట్​ వెబ్​సైట్​లో ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవడం తప్పనిసరి అని ఆర్మీ ప్రకటించింది. జులై నుంచి ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎయిర్‌‌ఫోర్స్‌‌, నేవీలో కూడా అగ్నివీర్‌‌ నియామకాల కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తేదీలను ప్రకటించింది. మంగళవారం నేవీ నోటిఫికేషన్‌‌.. ఈ నెల 24న ఎయిర్‌‌ఫోర్స్‌‌ నోటిఫికేషన్‌‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 14న అగ్నిపథ్​ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

నోటిఫికేషన్​లో ఏముందంటే..?

1. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్స్​ను ప్రత్యేకమైన ర్యాంక్‌‌‌‌‌‌‌‌గా చూస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల కంటే భిన్నంగా ఉంటుంది.

2. అగ్నివీర్​గా పనిచేసిన కాలంలో తెలుసుకున్న రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులు లేదా సంస్థలకు వెల్లడించకుండా అఫీషియల్​ సీక్రెట్స్​ యాక్ట్–1923 ప్రకారం నిషేధం విధించారు.

3. ఈ స్కీమ్​ను అమలులోకి తీసుకురావడంతో మెడికల్​ బ్రాంచ్​లోని టెక్నికల్​ కేడర్లు మినహా ఆర్మీలోకి రెగ్యులర్​ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ లో అగ్నివీర్లుగా నాలుగేండ్లు పూర్తి చేసుకున్న వారికే అవకాశం దక్కుతుంది. 

4. నాలుగేండ్లు పూర్తి కావడానికి ముందు సొంత అభ్యర్థనపై అగ్నివీర్​ను విడుదల చేసే అవకాశం లేదు. అయితే, కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ పథకం కింద నమోదు చేసుకున్న సిబ్బందిని విడుదల చేసేందుకు సంబంధిత శాఖ అనుమతిస్తే విడుదల చేయవచ్చు.

5. అగ్నిపథ్​ పథకం కింద కొత్త రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లు ఆర్మీ యాక్ట్–1950 నిబంధనలకు లోబడి ఉంటుంది. వీరు ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

6. అగ్నివీరులు తమ సర్వీస్​లో యూనిఫాంపై విలక్షణమైన చిహ్నాన్ని ధరిస్తారు.

7. ఆర్మీ అవసరాలు, విధానాల ఆధారంగా ప్రతి బ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నాలుగేండ్లు పూర్తయిన తర్వాత అగ్నివీర్లకు రెగ్యులర్ కేడర్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. 

8. నాలుగేండ్ల పనితీరుతో పాటు వివిధ ప్రమాణాల ఆధారంగా సెంట్రలైజ్డ్​ పద్ధతిలో ఈ దరఖాస్తులను ఆర్మీ పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి బ్యాచ్ అగ్నివీర్​లలో 25% నాలుగేండ్లు పూర్తయ్యాక రెగ్యులర్​ కేడర్‌‌‌‌‌‌‌‌లోకి ఎంపికవుతారు.

9. రెగ్యులర్ కేడర్‌‌‌‌‌‌‌‌గా ఎంపికైన అగ్నివీర్లు తదుపరి 15 సంవత్సరాల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సర్వీస్ నియమాలు (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్/ ఇతర ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల), షరతులు వారికి వర్తిస్తాయి.

10. నాలుగేండ్లు పూర్తయిన తర్వాత అగ్నివీర్లకు ఎంపిక చేసుకునే హక్కు ఉండదు.

11. ఎన్​రోల్​మెంట్ ప్రక్రియలో భాగంగా, ప్రతి అగ్నివీర్.. అగ్నిపథ్ పథకంలోని అన్ని నిబంధనలు, షరతులకు అంగీకారం తెలపాలి. 18 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి ఎన్​రోల్​మెంట్​ ఫామ్​పై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాల్సి ఉంటుంది.

12. రెగ్యులర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వారికి ఏడాదికి 90 రోజుల సెలవులు ఉంటే.. అగ్నివీర్లకు ఏడాదికి 30 రోజుల సెలవులు ఉంటాయి. మెడికల్​ ఎడ్వయిజ్​ ఆధారంగా మెడికల్ లీవ్ మంజూరు చేస్తారు.

13. అగ్నివీరుల నెల జీతంలో 30 శాతం తప్పనిసరిగా కార్పస్‌‌‌‌‌‌‌‌లో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం అందులో జమ చేస్తుంది.