బయో టెక్నాలజీ ద్వారా పంటల అభివృద్ధి

బయో టెక్నాలజీ ద్వారా పంటల అభివృద్ధి
  • నేషనల్ సీడ్ అసోసియేషన్ మీటింగ్​లో తీర్మానం  

హైదరాబాద్‌, వెలుగు: పత్తి పంటలో దిగుబడులను పెంచేందుకు కొత్త వంగడాలను రూపొందించాలని, బీజీ3 పత్తిపై రీసెర్చ్ చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏఐ) నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్ఎస్ఏఐ 16వ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది. బయో టెక్నాలజీ ద్వారా పంటల అభివృద్ధి, విత్తన నియంత్రణ సమస్యలు, వన్ నేషన్, వన్ లైసెన్స్ అంశంపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై అసోసియేషన్ తీర్మానాలు చేసింది. పత్తిలో బోల్ గార్డ్ (బీజీ) జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా వంగడాలను తీసుకురాబోతున్నట్టు ఎన్ఎస్ఏఐ తెలిపింది. పత్తితో పాటు మొక్కజొన్న, తృణధాన్యాల పంటల్లోనూ కొత్త వంగడాల అభివృద్ధికి ఆధునిక మాలిక్యులర్ పద్ధతులను ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది. జూమ్ ద్వారా పాల్గొన్న వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విత్తన కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు.