
- 5వ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు
- అక్టోబర్ 16 నుంచి మూడు రోజులు నిర్వహణ
- పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు : జాతీయస్థాయి స్పోర్ట్స్ ఫెస్టివల్ కు ఓరుగల్లు సిద్ధమైంది. 5వ నేషనల్ ఓపెన్ అండర్ --– 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు గురువారం ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగుతాయి. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) వేదిక కానుంది. 2021 సెప్టెంబర్ లో 60 నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ పోటీలు ఇక్కడే జరగ్గా, ఇప్పుడు రెండోసారి నిర్వహిస్తున్నారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ఇండియా(ఏఎఫ్ఐ), తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి 936 మంది క్రీడాకారులు తరలివచ్చారు.
40 విభాగాల్లో పోటీలు
నేషనల్ ఓపెన్ అండర్ –-23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు గతంలో న్యూఢిల్లీ, చత్తీస్ గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్ లో జరిగాయి. ఈసారి హనుమకొండలో నిర్వహిస్తున్నారు. మెన్, ఉమెన్ విభాగాల్లో మొత్తం 40 ఈవెంట్లు ఉంటాయి. 100, 200, 400, 800 మీటర్ల పరుగు 5 కి.మీ,10 కి.మీ రేస్, హై జంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, జావెలిన్ త్రో, షాట్ పుట్, 110 మీ, 400 మీటర్ హర్డిల్స్, పోల్ వాల్ట్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో అథ్లెట్లతో పాటు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఇండియన్ యూనివర్సిటీస్, నేవీ, ఎన్ సీసీ, పోలీస్, రైల్వేస్ తదితర డిపార్ట్ మెంట్లకు చెందిన క్రీడాకారు లు పాల్గొంటారు. ఇందులో తెలంగాణ నుంచి 13 మంది పురుష, ఏడుగురు మహిళా అథ్లెట్స్ ఉన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
జాతీయ స్థాయి పోటీలకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 16 మంది, స్టేట్ నుంచి మరో 75 మంది వరకు టెక్నికల్ ఆఫీసర్లు నిర్వహణ చూస్తున్నారు. స్థానిక అధికారులతో పాటు 50 మంది వలంటీర్లు, ఇతర సిబ్బందికి విధులు కేటాయించారు. ఇప్పటికే అథ్లెట్స్, కోచ్ లు, క్రీడా అధికారులు వరంగల్ సిటీకి చేరారు. జేఎన్ఎస్ రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్స్ లో వసతి సదుపాయాలను కల్పించారు.
గతంలోనే జేఎన్ఎస్ లో రూ.7 కోట్ల నిధులతో నిర్మించిన సింథటిక్ ట్రాక్ ఉండగా.. క్రీడాకారు ల కోసం వామ్ అప్ ట్రాక్ కూడా అందుబాటులోకి తెచ్చారు. వివిధ ఈవెంట్లు, అథ్లెట్స్ కు సౌకర్యంగా ఉండేలా టెంపరరీ షెడ్లు వేశారు. ఈ పోటీలను యూట్యూబ్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అథ్లెట్లతో పాటు లైవ్ స్ట్రీమింగ్ టీమ్ కు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలతో వరంగల్ సిటీ క్రీడాకారులతో సందడిగా మారింది.
ఉదయం 6 గంటలకు షురూ
అథ్లెటిక్స్ పోటీలు ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తారు. ముందుగా మెన్స్ విభాగంలో 10 వేల మీటర్ల పరుగుతో పోటీలు స్టార్ట్ చేస్తారు. అనంతరం ఇదే విభాగంలో విమెన్స్ పోటీలు ఉంటాయి. ఆ తర్వాత 7.30 గంటలకు డిస్కర్ త్రో, మెన్స్, విమెన్స్ విభాగాల్లో 100 మీటర్ల రేస్ ఉంటుంది. పోటీలకు చీఫ్ గెస్ట్ లుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, అథ్లెటిక్స్ అసోసియేషన్ నేతలు హాజరై ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.