ముంబై: భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో రవిశాస్త్రి పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కింద ఉన్న లెవల్ 1 స్టాండ్‌ను భారత మాజీ కెప్టెన్‌కు అంకితం చేయాలనే ప్రతిపాదనను ఎంసీఏ (ముంబై క్రికెట్ అసోసియేషన్) ఆమోదించింది. ఆటగాడిగా, కోచ్‌గా ముంబై.. భారత క్రికెట్‌కు ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసీఏ వెల్లడించింది.
మూడు స్టేడియం గేట్లకు ముగ్గురి పేర్లు:
వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టడంతో పాటు ఎంసీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియం మూడు ప్రధాన గేట్లకు ముగ్గురు భారత మాజీ క్రికెటర్లు దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీల పేర్లు పెట్టడానికి ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గేట్ నంబర్ 3కి సర్దేశాయ్ పేరు, గేట్ నంబర్ 6కి సోల్కర్ పేరు, గేట్ నంబర్ 5కి ఎడుల్జీ పేరు పెట్టనున్నారు.
‘‘ముంబై క్రికెట్ వారసత్వాన్ని బలోపేతం చేయడంలో ఈ ముగ్గురు దిగ్గజాలు కీలక పాత్ర పోషించారు. అలాగే, భారత క్రికెట్‌కు అత్యున్నత స్థాయిలో అపారమైన కృషి చేశారు. వారి విజయాలను శాశ్వతంగా స్మరించుకోవడం.. స్టేడియం సందర్శించే భవిష్యత్ తరాల క్రికెటర్లు, అభిమానులకు స్ఫూర్తినివ్వడం ఈ చొరవ లక్ష్యం’’ అని ఎంసీఏ స్పష్టం చేసింది.
