
- లేకుంటే బీజేపీ ఎంపీలను తెలంగాణలోకి రానియ్యం
- బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడించిన పాలమూరు యువగళం నాయకులు
బషీర్ బాగ్, వెలుగు : పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ పాలమూరు యువగళం వ్యవస్థాపక అధ్యక్షుడు టి.కె.శివప్రసాద్ డిమాండ్చేశారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ఆఫీసును ముట్టడించారు. ఫ్లకార్డులతో ర్యాలీగా వచ్చి, బీజేపీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా వాగ్వాదం, తోపులాట జరిగింది. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపీలను గెలిపించిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరించిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పాలమూరులో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాణం తీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి జాతీయ హోదా ప్రకటించాలని, లేకుంటే బీజేపీ ఎంపీలను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.