
గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు మొదలయ్యాయి. మీర్‌పేట మున్సిపల్ ఆఫీసు దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి సబితారెడ్డి పాలాభిషేకం చేశారు. మీర్ పేట మున్సిపల్ ఆఫీసు నుంచి బడంగ్ పేట వరకు సాగిన ర్యాలీలో నాయకులు, అధికారులు, స్కూల్ స్టూడెంట్లతో కలిసి ఆమె పాల్గొన్నారు. సరూర్ నగర్‌లోని వీఎంఎం హోం నుంచి ఎల్ బీనగర్ ఇండోర్ స్టేడియం వరకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. మల్కాజిగిరి పరిధి ఆనంద్ బాగ్ నుంచి చౌరస్తా వరకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో అధికారులు, కార్పొరేటర్లు ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షల గురించి అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో మల్కాజిగిరి పరిధిలోని వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ మేయర్, స్కూల్ స్టూడెంట్లు పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలో కలెక్టరేట్ నుంచి సంగెం లక్ష్మీబాయి స్కూల్ వరకు జాతీయ జెండాలతో స్కూల్ స్టూడెంట్లు, అధికారులు ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు. మారేడ్ పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో వేడుకలు నిర్వహించగా.. స్కూల్ స్టూడెంట్లు సైతం పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత అందజేసిన ఫుడ్ ప్యాకెట్లను ఓపెన్ చేయగా.. దుర్వాసన రావడంతో పాటు బూజు ఉండటంతో పక్కన పడేసినట్లు స్టూడెంట్లు చెప్పారు. దీన్ని గమనించిన అధికారులు వెంటనే 20 బ్యాగుల్లోని ఫుడ్ ప్యాకెట్లను పడేశారు. ఫుడ్ ప్యాకెట్ల నుంచి వాసన వస్తోందని కొందరు స్టూడెంట్లు వచ్చి చెప్పగానే వెంటనే పక్కన పెట్టించామని.. ఎవరికీ పంచలేదని తిరుమలగిరి ఎమ్మార్వో హసీనా వివరణ ఇచ్చారు.
- వెలుగు, ఎల్బీనగర్/మల్కాజిగిరి/గండిపేట/వికారాబాద్