చట్టసభల్లో ఓబీసీల రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త ఉద్యమం : ఆర్. కృష్ణయ్య

చట్టసభల్లో ఓబీసీల రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త ఉద్యమం : ఆర్. కృష్ణయ్య
  • అన్ని పొలిటికల్ పార్టీలను ఏకం చేస్తం: ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ, బషీర్​బాగ్, వెలుగు: చట్టసభల్లో ఓబీసీల రాజకీయ రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

ఈ మేరకు సోమవారం అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్​లో జరిగిన జాతీయస్థాయి ఓబీసీ సెమినార్​కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ సాధించి తీరుతామని చెప్పారు. స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్​చేశారు. 

దేశంలో బీసీల అసమానతలు తొలగిపోవాలంటే ఫీజు రీయింబర్స్​మెంట్, ఓవర్సీస్ స్కాలర్​షిప్ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభారణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. బీసీల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని వాటిని సాధించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.