శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించండి..ఇండియా, చైనా, బ్రెజిల్ను నాటో వార్నింగ్

శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించండి..ఇండియా, చైనా, బ్రెజిల్ను నాటో వార్నింగ్
  • రష్యాతో వ్యాపారం చేస్తే 100% టారిఫ్​ వేస్తం
  • ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్
  • ఉక్రెయిన్​తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే  
  • తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక 

వాషింగ్టన్: రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే వదిలిపెట్టబోమని, 100 శాతం టారిఫ్​లు వేస్తామంటూ ఇండియా, చైనా, బ్రెజిల్​ను  నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్​తో రష్యా యుద్ధాన్ని ఆపాల్సిందేనని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్​ ఇచ్చింది. శాంతి చర్చలకు పుతిన్​ను ఒప్పించాల్సిన బాధ్యత ఈ మూడు దేశాల అధినేతలపై ఉందని పేర్కొంది. వెంటనే ఆయనకు ఫోన్​ చేసి చర్చలకు అంగీకరించేలా ఒత్తిడి తేవాలని తెలిపింది. 

వార్​ ఆపకపోతే రష్యాపై 100 శాతం టారిఫ్​ విధిస్తామని, ఇందుకు 50 రోజుల గడువు పెడ్తున్నట్లు మూడు రోజుల కింద అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. అదేవిధంగా రష్యా నుంచి ఆయిల్​ దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం టారిఫ్​ విధిస్తామంటూ కొన్నాళ్లుగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం అమెరికా సెనెటర్స్​తో వాషింగ్టన్​లో నాటో సెక్రటరీ జనరల్​ మార్క్​ రుట్టె సమావేశయ్యారు. ఉక్రెయిన్​, రష్యా యుద్ధంపై చర్చించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా, చైనా, బ్రెజిల్​కు హెచ్చరికలు చేశారు. ‘‘ఇండియా ప్రధానమంత్రి అయినా సరే, చైనా అధ్యక్షుడైనా సరే, లేదా బ్రెజిల్​అధ్యక్షుడైనా సరే రష్యాతో బిజినెస్​ కొనసాగిస్తే.. అక్కడి నుంచి ఆయిల్​ దిగుమతి చేసుకుంటే భారీ పెనాల్టీలు తప్పవు. ఉక్రెయిన్​తో శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్​ను  ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఆ మూడు దేశాల అధినేతలపై ఉంది. 

పుతిన్​కు ఫోన్​ చేసి శాంతి చర్చలను సీరియస్​గా తీసుకోవాలని ఒత్తిడి తెండి. ఆయన శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది” అని మార్క్​ రుట్టె హెచ్చరించారు.