ఉక్రెయిన్‌కు సైనిక దళాలను పంపే ప్రసక్తి లేదు

ఉక్రెయిన్‌కు సైనిక దళాలను పంపే ప్రసక్తి లేదు

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నాటో తీవ్రంగా ఖండించింది.రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని,ఉక్రెయిన్‌ నుంచి దళాలను ఉపసంహరించాలని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కోరారు.అయితే ఉక్రెయిన్‌కు సైనిక దళాలను పంపే ప్రసక్తి లేదన్నారు. అలాగే ఉక్రెయిన్‌లో నాటో దళాలు కూడా లేవన్నారు. కానీ, ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తుందన్నారు స్టోలెన్ బర్గ్ ​. నాటో మిత్రదేశాలు చాలా కాలంగా ఆ దేశానికి మద్దతిస్తున్న  విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చాలా బలమైన, మెరుగైన సైనిక దళాన్ని నిర్మించడంలో శిక్షణ పరంగా ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సాయం అందించినట్లు తెలిపారు.

రష్యా దూకుడు నుంచి కూటమిని కాపాడుకుంటామని నాటో చీఫ్ స్టోలెన్​బర్గ్​ తెలిపారు. దీని కోసం అవసరమైన చర్యలన్నీ చేస్తున్నట్లు చెప్పారు. తమ గగనతలాన్ని రక్షించుకోవడానికి 100కుపైగా జెట్లు, ఉత్తరం నుంచి మధ్యధరా వరకు సముద్రంలో 120కుపైగా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయని ఆయన చెప్పారు. తూర్పు భాగంలో నాటో దళాలను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు బలగాలను మోహరించడానికి తమ సైనిక కమాండర్‌లకు మరింత అధికారాన్ని ఇచ్చే రక్షణ ప్రణాళికలను రూపొందించినట్లు వివరించారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు నాటో నేతలు రేపు(శుక్రవారం) భేటీకానున్నట్ తెలిపారు. అంతర్జాతీయ ఆర్డర్‌ ఉల్లంఘనను తాము ఎప్పటికీ అంగీకరించబోమని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటడంలో తమ మిత్రదేశాలు కలిసి ఉన్నాయన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై నాటో మిత్రదేశాలతో పాటు ఈయూ తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్కు అండగా ఉంటాం