
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆస్కార్ కోసం భారతదేశం నుంచి 'ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ పోటీ పడుతున్నాయి. ఒకేసారి మూడు చిత్రాలను ఆస్కార్ కోసం నామినేట్ కావడం ఇదే తొలిసారి.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో స్థానం దక్కించుకుంది. శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఆల్ దట్ బ్రీత్స్ చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్ విభాగంలో నామినేట్ అయింది. కార్తికీ గోన్సాల్వెస్ తెరకెక్కించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో నామినేషన్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూడింటిలో కనీసం ఒక్కదానికైనా ఆస్కా్ర్ వస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
నాటు నాటుకు గట్టి పోటీ...
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్‌తో పాటు...బ్లాక్ పాంథర్ మూవీలోని లిఫ్ట్ మీ అప్ సాంగ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కేటగిరీలో టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ నుంచి అప్లాజ్ సాంగ్, టాప్‌గన్ మార్వెరిక్ నుంచి హోల్డ్ మై హ్యాండ్ పాట, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ నుంచి ది ఈజ్ ఏ లైఫ్ సాంగ్ పోటీ పడుతున్నాయి.
ఆస్కార్ అందించనున్న దీపికా పదుకొనె
ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బాలీవుడ్ భామ దీపికా పదుకునె సందడి చేయనుంది. ఒక అవార్డును అందజేసే అవకాశాన్ని దీపికా పొందింది. అటు ఆస్కార్ వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ,కీరవాణి కలిసి నాటు నాటు సాంగ్‌ను పాడనున్నారు.