రాష్ట్రంలో పూర్తిగా బంద్​కాని నాటుసారా

రాష్ట్రంలో పూర్తిగా బంద్​కాని నాటుసారా

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నాటుసారా తయారీ పూర్తిస్థాయిలో బంద్​ కాలేదు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్​ శాఖ, పోలీసులు నిర్వహించిన దాడుల్లో పలుచోట్ల సారా తయారీ కేంద్రాలను గుర్తించారు. దీంతో ఈ అంశంపై శుక్రవారం హైదరాబాద్​లోని ఆబ్కారీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులతో ఆ శాఖ కమిషనర్​ శ్రీధర్ రివ్యూ చేశారు. రాష్ట్రంలోని 26 ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల పరిధిలో నాటుసారా తయారు చేస్తున్నట్టు దాడుల్లో బయటపడిందన్నారు. ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, పోలీసులు కలిసి మూడు నెలల్లో నాటుసారా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఆయన అదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉందన్నారు. 

నాటుసారాతోపాటు ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌ కూడా లభించిందని, ఇది రాష్ట్రంలోకి రాకుండా ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక నిఘా పెట్టి దాడులు నిర్వహించాలని సూచించారు. పట్టణాలు, ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్స్‌‌‌‌‌‌‌‌, ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌజుల్లో జరిగే పార్టీలకు సగం మద్యాన్ని వైన్స్​లో తీసుకొని మిగిలిన సగం మద్యాన్ని నాన్‌‌‌‌‌‌‌‌డ్యూటీ పెయిడ్‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌ను వినియోగిస్తున్నారన్నారు. ఈ వేసవిలో బీర్ల స్టాక్‌‌‌‌‌‌‌‌ లేదనే వార్తలు వస్తున్నాయని, రికార్డుల పక్రారం పరిశీలిస్తే గత సంవత్సరం కంటే ఎక్కువ బీర్ల నిల్వలు ఉన్నట్టు చెప్తున్నాయన్నారు. ఈ విషయంలో అధికారులు దాడులు నిర్వహించి మద్యం దుకాణాల్లో బీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

కోర్టులు, వాణిజ్య పన్నుల శాఖ సూచనలను పాటించాలన్నారు. ఆగస్టు నాటికి నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌  వీబీ కమలాసన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశించారు. నాన్‌‌‌‌‌‌‌‌డ్యూటీ పెయిడ్‌‌‌‌‌‌‌‌ మద్యం రవాణా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే డైజోఫాం లాంటి పదార్థాలను పట్టుకోవాలని, గంజాయి, నార్కోటిక్‌‌‌‌‌‌‌‌, ఇతర మత్తు మందుల తయారీ, దిగుమతి, అమ్మకాలపై నిఘా పెట్టి, నిందితులను పట్టుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.