
రూ. 200 కోసం మ్యాచ్ ఆడి.. టీమిండియాకు ఎదిగిన యువ పేసర్ సైనీ
అది 2013.. ఆ కుర్రాడికి క్రికెట్ అంటే పిచ్చి. మెరుపు వేగంతో బంతులు విసరడం అంటే మహా ఇష్టం. ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలన్నది అతని స్వప్నం. కానీ, టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ చేయడం తప్పితే అతనికేమీ తెలియదు. కనీసం గ్రేస్ బాల్‌ను పట్టుకోలేదు.. ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో సీరియస్ గా ఆడిన దాఖలా లేదు..! మ్యాచ్‌కు రెండొందల రూపాయలిచ్చే లోకల్ టోర్నీల్లో ఆడడం, వికెట్లు తీయడమే అతని పని..!
కట్ చేస్తే..
ఏడాది తిరిగేలోపే అతను రంజీ జట్టులోకి వచ్చేశాడు..! చూస్తుండగానే అతని పేరు దేశవాళీల్లో మార్మోగిపోయింది..! మరో మూడేళ్లకు ఐపీఎల్ కాంట్రాక్ట్.. ఇప్పుడు ఏకంగా టీమిండియాలోనే చోటు దక్కింది..! ఆ కుర్రాడు ఎవరో కాదు..! వెస్టిండీస్ టూర్‌లో పాల్గొనే ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయిన యువ పేసర్ నవదీప్ సైనీ. హర్యానాలో ఒక డ్రైవర్ కుటుంబంలో పుట్టి.. స్వయం ప్రతిభతో నేషనల్ టీమ్‌కు ఆడే స్థాయికి ఎదిగిన ఢిల్లీ యంగ్‌స్టర్ జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరం..!
ఈ సీజన్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్–- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తొలి మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 71 రన్స్‌కే కుప్పకూలింది. చిన్న టార్గెటే కదా చెన్నై ఐదారు ఓవర్లలోనే ఊదేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఛేజింగ్‌కు వచ్చిన చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్‌కు ఆరంభంలోనే ఓ కుర్రాడు చుక్కలు చూపించాడు. 151 కి.మీ. వేగంతో అతను ఓ బౌన్సర్ హెల్మెట్‌కు తగలడంతో వాట్సన్ దిమ్మతిరిగింది. ఆ బౌన్సర్ సంధించింది నవదీప్ సైనీ. దేశవాళీల్లో సైనీ సత్తా గురించి క్రికెట్ వర్గాలకు తెలిసినా.. అతను ఆ రేంజ్‌లో బౌలింగ్ చేస్తాడని అందరికీ తెలిసింది ఆ మ్యాచ్‌తోనే. ఇలా 150 మార్కుకు తగ్గకుండా అత్యంత వేగవంతంగా బంతులు విసురడంతో పాటు నిలకడగా ఆడే యువ బౌలర్లలో నవదీప్ ముందుంటాడు.
రానివ్వని స్టేడియంలోనే అదరగొట్టేశాడు..
నవదీప్ సైనీ.. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలైన విజయం సాధించవచ్చు అనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అతని జీవితంలో ఎత్తు పల్లాలు అనేకం. ఒకప్పుడు ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లాగ్రౌండ్ ముందు మ్యాచ్ చూడటానికి వస్తే సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. కొంతకాలానికే ఢిల్లీ తరపున అదే స్టేడియంలో అతను రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఢిల్లీకి సమీపంలోని కర్నాల్(హర్యానా)లో పుట్టిన నవదీప్ సైనీ చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి ఓ ప్రభుత్వ డ్రైవర్. తాతేమో సైనికుడు. స్వాతంత్రోద్యమ కాలంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ స్థాపించిన అజాద్ ఫౌజ్ హింద్‌లో కూడా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సైనీకి క్రికెట్ అంటే ఇష్టం. అతని తండ్రి తెచ్చే సంపాదన కుటుంబం గడవడమే కష్టమయ్యేది. క్రికెట్‌లో రాణిస్తున్నాడని తెలిసినా తన కొడుకును మంచి అకాడమీలో చేర్చే స్థోమత ఆ తండ్రికి లేకుండా పోయింది. అయినా.. సైనీ ఏనాడూ బాధ పడలేదు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని నడుచుకునేవాడు. ఖర్చుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. లోకల్ టోర్నీలో ఆడితే మ్యాచ్‌కు రెండొందలు వచ్చేవి. వాటితోనే క్రికెట్ అవసరాలు తీర్చుకున్నాడు.
బెంగళూరులోనే టెస్ట్ ఆడాల్సినా..
2017లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.పది లక్షలకు కొనుక్కున్నా.. అతనికి ఆడే అవకాశం రాలేదు. తర్వాతి ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలవడంతో బెంగళూరు రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ వీటన్నింటిని మించి అద్భుతం 2018లో జరిగింది. టెస్ట్ హోదా పొందిన అఫ్గానిస్థాన్‌తో బెంగళూరులో జరిగిన ఏకైక టెస్టు కోసం సైనీ టీమిండియాలోకి వచ్చాడు. గాయపడ్డ షమీ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చినా ఆఖరి నిమిషాల్లో ఆడే అవకాశం రాలేదు. అయినా నిరాశ చెందకుండా ఈ ఏడాది ఐపీఎల్‌లో 11 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. వరల్డ్‌కప్‌లో ఇండియా నెట్ బౌలర్‌గా ఎంపికకైన సైనీ వెస్టిండీస్–ఎతో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్లు తీసి జట్టును గెలిపించడం కలిసొచ్చింది.
అండగా ఆ ఇద్దరు
ఢిల్లీ రంజీ క్రికెటర్ సుమిత్ నర్వాల్ నిర్వహించిన కర్నాల్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడం సైనీ కెరీర్‌ను మలుపు తిప్పింది. నవదీప్‌లోని స్పార్క్‌ను గుర్తించిన నర్వాల్ అతడిని ఢిల్లీకి తీసుకెళ్లి శిక్షణ ఇచ్చాడు. టెన్నిస్ బాల్ వదిలి గ్రేస్ బాల్ అందుకున్న సైనీకి ఢిల్లీ రంజీ జట్టు నెట్ బౌలర్‌గా చాన్స్ వచ్చింది. నెట్స్‌లో తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మాజీ క్రికెటర్, ఢిల్లీ రంజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌ను ఇంప్రెస్ చేశాడు. నవదీప్‌లోని ప్రతిభను గుర్తించిన గౌతమ్.. వెంటనే అతనికి మంచి బూట్లను అందించి ప్రొత్సహించాడు. ఇదే తీరున కష్టపడితే త్వరలోనే జాతీయజట్టులోకి ఎంపికవుతామని స్ఫూర్తినిచ్చాడు. అనంతరం సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఒప్పించి మరీ ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకున్నాడు. అలా 2013–14 సీజన్‌లో విదర్భపై అరంగేట్రం చేసిన సైనీ.. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత ఆరేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 2017 రంజీ సీజన్‌లో అయితే సైనీ విశ్వరూపం కనబర్చాడు. ఆ సీజన్‌లో 34 వికెట్లతో టీమ్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచారు. చాలాకాలం తర్వాత ఢిల్లీ రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరడంతో కీలక పాత్ర పోషించాడు.