‘పరంపర2’కు పాత్రలే బలం

‘పరంపర2’కు పాత్రలే బలం

హీరో, విలన్‌‌గానే  కాకుండా ఇంపార్టెంట్ రోల్స్‌‌తోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వరుస వెబ్ సిరీసుల్లో నటిస్తున్న నవీన్.. ‘పరంపర2’ సిరీసుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.  ఈ నెల 21 నుంచి ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నవీన్ చెప్పిన విశేషాలు. 

ఇది ఓ కొడుకు యుద్ధం
‘పరంపర’ వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్‌‌తోపాటు సెకెండ్ సీజన్‌‌ను కూడా అప్పుడే ప్లాన్ చేశాం. అందుకే ఇంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రాగలుగుతున్నాం. దీనికి ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకులు. ఈ పొలిటికల్ రివెంజ్ డ్రామాలో గోపి అనే పవర్‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌ చేశాను.  నా తండ్రిగా జగపతిబాబు, బాబాయ్‌‌గా శరత్‌‌ కుమార్ నటించారు. ఫస్ట్ సీజన్‌‌లో శరత్ కుమార్‌‌‌‌కు ఎక్కువ స్కోప్ ఉంది. కానీ ఇందులో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన  తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు. ఇందులో ఆరేడు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని బాగా సపోర్ట్ చేశారు.  మంచి కంటెంట్ ఎక్కడున్నా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం. నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదులుకోను.  చిన్న సినిమా, పెద్ద సినిమా, వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను.