హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో నవీన్ యాదవ్ నయా రికార్డ్ సృష్టించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు.
జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజార్టీ పీజేఆర్ కుమారుడు విష్ణు పేరిట(2009లో 21,741) ఉండేది. ఇక, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికను రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరుఫున స్థానికుడు నవీన్ యాదవ్ బరిలోకి దిగగా.. బీఆర్ఎస్ గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్‌ను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది.
