పోలింగ్ బూత్ సమీపంలో నక్సల్స్ బాంబు దాడి

పోలింగ్ బూత్ సమీపంలో నక్సల్స్ బాంబు దాడి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశం మొత్తమ్మీద పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినా కూడా పలు రాష్ట్రాల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలింగ్ బూత్ సమీపంలో కొందరు నక్సల్స్  బాంబులు పేల్చారు.

గురువారం ఉదయం 10.30 గంటలకు పోలింగ్ బూత్ నుంచి సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న వాఘేజారీ  ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఉన్నారని.. ఆ పేలుడులో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని జిల్లా ఎస్పీ శైలేష్ భక్వాడే అన్నారు.

బుధవారం కూడా ఆ జిల్లాలోని గట్టా జాంబియా అనే గ్రామంలో విధుల నిమిత్తం పోలింగ్ స్టేషన్ కు వెళుతున్న అధికారులపై నక్సల్స్ దాడికి పాల్పడ్డారని ఎస్పీ అన్నారు. ఈ ఘటనలో వారికి రక్షణగా ఉన్న ఓ సీఆర్పిఎప్ జవానుకు స్వల్పగాయాలయ్యాయని ఆయన తెలిపారు.

ఓటు వేయడానికి వచ్చే గ్రామస్థులలో భయాందోళనలను సృష్టించేందుకే నక్సల్స్ ఈ దాడులకు ప్రయత్నిస్తున్నారని ఎస్పీ చెప్పారు.