- క్రూడాయిల్ రేట్లు భారీగా పెరగడమే కారణం
న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు పైన కదులుతుండడంతో ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నయారా ఎనర్జీ గురువారం ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్ ధరను రూ.ఐదు, డీజల్ ధరను రూ.మూడు పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఇండియాలో 6,967 పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది.
ఇండియా మొత్తం మీద 1,02,075 బంకులు ఉండగా, ఇందులో 92–93 శాతం బంకులను ఇండియా ఆయిల్ కార్పొరేషన్ ( ఐఓసీ), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నిర్వహిస్తున్నాయి. రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ జియోబీపీ 2,185 ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏప్రిల్ 2022 నుంచి మారలేదు. ప్రభుత్వ రంగ కంపెనీలు క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా, నష్టాలను భరిస్తూ పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. ప్రైవేట్ రిటైలర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందడం లేదు. అందువల్ల నయారా తాజాగా ధరలను పెంచింది.
ఈ సంస్థలో రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్‌కు మెజార్టీ వాటా ఉంది. అందువలన రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేస్తోంది. ఐఓసీ, హెచ్‌సీఎల్, బీపీసీఎల్ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకపోయినా, ప్రీమియం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2, పరిశ్రమల కోసం బల్క్ డీజిల్‌పై లీటర్‌కు రూ.22 పెంచాయి.
దీంతో ఢిల్లీలో ప్రీమియం 95-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ.99.89 నుంచి రూ.101.89కి పెరిగింది. బల్క్ డీజిల్ ధర లీటర్‌కు రూ.87.67 నుంచి రూ.109.59కి చేరింది. అయితే సాధారణ పెట్రోల్ రూ.94.77 వద్ద, డీజిల్ రూ.87.67 వద్ద ఉన్నాయి.
60 రోజులకు సరిపడా స్టాక్ ఉంది: ప్రభుత్వం
దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొరత లేదని, సుమారు 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు, ఒక నెలకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో క్యాష్ -అండ్- క్యారీ విధానం వల్ల చిన్న స్థాయి బంకులు సప్లయ్ పొందడంలో ఇబ్బందిపడ్డాయి.
తర్వాత ప్రభుత్వం క్రెడిట్ పరిమితిని మూడు రోజులకు పొడిగించింది. దీంతో బంకులకు సప్లయ్ సమస్యలు తగ్గాయి. ప్రభుత్వ రంగ ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ కూడా తమ పంపులు సాధారణంగా పనిచేస్తున్నాయని ప్రకటించాయి. ఇండియాలో ఎల్‌పీజీ ఉత్పత్తి రోజుకు 50 వేల టన్నులకు పెరిగింది.
ఇది దేశ అవసరాల్లో (రోజుకి 80 వేల టన్నుల్లో) 60శాతం కవర్ చేస్తుంది. మిగతా 30 వేల టన్నులు దిగుమతుల ద్వారా వస్తాయి. ఇప్పటికే 8 లక్షల టన్నుల ఎల్‌పీజీ కార్గోలు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి రానున్నాయి. క్రూడాయిల్ ధర గురువారం 5 శాతం పెరిగి బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరింది.
హైదరాబాద్‌లో ధరలు సగటున ఇలా..
ఇంధనం (లీటరుకు) కొత్త ధర పెరుగుదల
నయారా పెట్రోల్ రూ.114.50 రూ.5
నయారా డీజిల్ రూ.98.70 రూ.3
ప్రభుత్వ బంకుల్లో
సాధారణ పెట్రోల్ రూ.107.50 మార్పు లేదు
సాధారణ డీజిల్ రూ.95.70 మార్పు లేదు
ప్రీమియం పెట్రోల్
(ఎక్స్‌పీ95, ఐఓసీ) రూ.111.80 రూ.2
బల్క్ డీజిల్
(పరిశ్రమల కోసం) రూ.109.60 రూ.22
