సూక్ష్మ వ్యాపార సంస్థలకు వరం ఎన్‌బీఎఫ్‌సీలు

సూక్ష్మ వ్యాపార సంస్థలకు వరం ఎన్‌బీఎఫ్‌సీలు
  • హోమ్‌క్రెడిట్‌ ఇండియా సీఈవో ఒండ్రెజ్‌ కుబిక్‌

సూక్ష్మ వ్యాపార సంస్థలకు భారతదేశంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) వరంగా నిలుస్తున్నాయి. పరిశ్రమ వర్గాల నివేదిక ప్రకారం గత ఏడాది డిసెంబర్ 21 నాటికి  సూక్ష్మ ఋణ పరిశ్రమ మొత్తం ఋణ పోర్టుఫోలియో (జీఎల్‌పీ) 10.1శాతం వృద్ధి చెంది 2,32,648 కోట్ల రూపాయలుగా నమోదు అయింది. ఈ జీఎల్‌పీలో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2019 నాటికి  9.06 శాతంగా నమోదైంది.
కోవిడ్ ప్రభావంతో లక్షలాది ఉద్యోగాలు గల్లంతు 
కోవిడ్ మహమ్మారి కారణంగా భారతీయ కార్మిక మార్కెట్‌లో లక్షలాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనమీ (సీఎంఐఈ) డాటా ప్రకారం గత మార్చినెలలో 39.81 కోట్లుగా ఉన్న కార్మికులు, ఏప్రిల్‌ 2021 నాటికి 39.08 కోట్లకు చేరారు. అంటే ఒక్క ఏప్రిల్‌ నెలలోనే దాదాపు 73.5 లక్షల మంది నిరుద్యోగులుగా మారిపోయారు. నిరుద్యోగులుగా మారిన వారిలో ఎక్కువ శాతం మంది తమ నైపుణ్యాలతో సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. దీంతో సూక్ష్మ వ్యవస్థాపకత కూడా పెరిగింది.
సూక్ష్మ వ్యాపార సంస్థలకు ఆర్థిక సవాళ్లు
సూక్ష్మ వ్యాపార సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. భారతదేశపు జీడీపీకి 30 శాతం తోడ్పాటును ఇవి అందిస్తున్నట్లు ఒక అంచనా. ఉపాధి కల్పన పరంగానూ ఇవి అత్యంత కీలకమైనవి. అయితే వీటికి పరిమిత ఋణ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. ఈ తరహా వ్యవస్థాపక సంస్థలతో రిస్క్‌ అధికంగా ఉండటం దీనికి ఓ కారణం. ఈ అవరోధాలను ఎన్‌బీఎఫ్‌సీలు సమూలంగా తొలగించడంతో పాటుగా ఆర్ధికంగా అండగా నిలుస్తున్నాయి.  ఇటీవలి కొంత కాస్త చిక్కులు ఎదురైనప్పటికీ భారతదేశంలో ఎన్‌బీఎఫ్‌సీలకు సహేతుకంగా ఋణాలను అందిస్తున్నాయి. వేగవంతంగా సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణ సామర్థ్యం సైతం వృద్ధి చెందుతోంది. అలాగే తాజాగా రిజర్వ్‌ బ్యాంకు తీసుకున్న చర్యలతో ఎన్‌బీఎఫ్‌సీలు ప్రయోజనం పొందుతున్నాయి. 
సూక్ష్మ వ్యాపారులకు కొండంత సహాయం
సూక్ష్మ చిన్న వ్యాపార సంస్థలకు ఎన్‌బీఎఫ్‌సీలు జీవనరేఖలా నిలుస్తున్నాయి. కొత్త సాంకేతిక విధానాలతో ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో వ్యవస్థీకృత ఆర్థిక రంగం, సూక్ష్మ వ్యాపారులు నడుమ ఖాళీలను పూరిస్తున్నాయి. ఎలాంటి ఆస్తుల తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండా వ్యవస్థాపక ఋణాలను వేగంగా, ఆకర్షణీయమైన వడ్డీరేట్లకు, అతి తక్కువ పేపర్‌ వర్క్ తో ఇవి ఋణాలు అందిస్తున్నాయి. దీనికి తోడు సూక్ష్మ వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని, వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఋణ గ్రహీతలలో ఆత్మవిశ్వాసమూ పెంపొందిస్తున్నాయి. పోటీ వాతావరణంలో నిలదొక్కుకునేలా తీర్చిదిద్దడంతో పాటుగా సుస్థిర జీవనోపాధి అవకాశాలనూ ఎన్‌బీఎఫ్‌సీలు అందిస్తున్నాయి.