
బెంగళూరు: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. స్వదేశంలో అరుదైన ఆటకు రెడీ అయ్యాడు. తన పేరు మీద కంఠీరవ స్టేడియంలో శనివారం జరిగే ఎన్‌సీ క్లాసిక్ జావెలిన్ త్రో కాంపిటీషన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇంటర్నేషనల్ స్టార్లతో పోటీపడటంతో పాటు స్వదేశంలోనూ 90 మీటర్ల మార్క్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 27 ఏళ్ల వయసులోనే అన్ని రకాల గ్లోబల్ మెడల్స్‌ను నెగ్గిన నీరజ్.. క్లాసిక్ ఈవెంట్ ద్వారా స్వదేశంలో తన ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కు కల్పించాడు. అలాగే దేశంలో ఈ క్రీడ ప్రొఫైల్‌ను పెంచడానికి ఈ టోర్నీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు.
‘ఇండియాలో ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించడం నాకు చాలా కాలంగా ఉన్న కల. ఇప్పుడు ఇది నిజం కాబోతున్నది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. దేశం కోసం ఒలింపిక్, ఇతర పతకాలను గెలిచా. ఇప్పుడు ఈ ఈవెంట్‌తో ఇండియా అథ్లెట్లకు, అభిమానులకు ఏదో తిరిగి ఇస్తున్నా’ అని చోప్రా వ్యాఖ్యానించాడు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ), వరల్డ్ అథ్లెటిక్స్ సహకారంతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌తో కలిసి ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఎన్‌సీ క్లాసిక్ ప్రతి ఏడాది జరుగుతుందని, ఫ్యూచర్‌లో జావెలిన్ కాకుండా ఇతర క్రీడలు కూడా జోడిస్తామని వెల్లడించాడు.
వాస్తవానికి ఎన్‌సీ క్లాసిన్ మే 24న పంచకుల (హర్యానా)లో నిర్వహించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ టోర్నీలకు సరిపోయే లైటింగ్ లేకపోవడంతో బెంగళూరుకు మార్చారు. ఆ తర్వాత పహల్గాం ఉగ్రదాడితో మరోసారి వాయిదా పడింది. వరల్డ్ అథ్లెటిక్స్ దీనికి కేటగిరి–ఏను కేటాయించడంతో.. ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత హై ప్రొఫైల్ సింగిల్ డిసిప్లిన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీగా రికార్డులకెక్కింది. చోప్రాతో సహా 12 మంది బరిలోకి దిగనున్నారు.
జూలియన్ వెబెర్, అండర్సన్ పీటర్స్ ఈ టోర్నీలో ఆడటం లేదు. దీంతో చోప్రా టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. థామస్ రోహ్లర్ (జర్మనీ), జూలియన్ యెగో (కెన్యా), కర్టిస్ థాంప్సన్ (అమెరికా).. చోప్రా ప్రధాన పోటీదారులు కానున్నారు. మార్టిన్ కోనెక్ని (చెక్), లూయిజ్ మౌరిసియో డా సిల్వ (బ్రెజిల్), రుమేశ్ పతిరాజ్ (శ్రీలంక), సిప్రియన్ మిర్జిగోల్డ్ (పోలెండ్)తో పాటు ఇండియాకు చెందిన సచిన్ యాదవ్, యశ్విర్ సింగ్, రోహిత్ యాదవ్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.