
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని ఓ కార్పోరేట్ స్కూల్లో చిన్నారులపై వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్‌రైట్స్ (ఎన్సీపీసీఆర్) నుంచి ఆదేశాలు రావడంతో ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్ కదిలి స్కూల్‌ను సందర్శించి, విచారణ జరిపింది. ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని బీబీనగర్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్(బిర్లా ఓపెన్ మైండ్)లో దాదాపు 1200 మంది చదువుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వస్తుండడంతో హాస్టల్ కూడా మెయింటేన్స్ చేస్తున్నారు.
ఈ స్కూల్లో పలువురు చిన్నారులపై అక్కడి స్టాఫ్ ఇటీవల వేధింపులకు పాల్పడ్డారు. వేధింపుల విషయం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్‌రైట్స్ (ఎన్సీపీసీఆర్) దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్కు ఎన్సీపీసీఆర్ విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసింది. స్టూడెంట్స్ పట్ల కొందరు స్టాఫ్ అనుచితంగా ప్రవర్తించినట్టు ఎన్సీపీసీఆర్ తమ దృష్టికి తెచ్చిందని యాదాద్రి డీఈవో సత్యనారాయణ అన్నారు. స్టూడెంట్స్‌తో మాట్లాడాం. హాస్టల్‌కు అనుమతి లేదని తెలిసింది. స్కూల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. 1200 మంది స్టూడెంట్స్ చదువు ఇబ్బందులో పడే ప్రమాదం ఉంది. ముందుగా హాస్టల్ తొలగించాలని నోటీసులు ఇస్తాం.