కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. 50 లక్షల పక్కా ఇండ్లు: NDA కూటమి మేనిఫెస్టో విడుదల

కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. 50 లక్షల పక్కా ఇండ్లు: NDA కూటమి మేనిఫెస్టో విడుదల

పాట్నా: బిహార్​అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని మరోసారి గెలిపిస్తే రాష్ట్రంలోని యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. కోటి మంది మహిళలను లఖ్ పతి దీదీలుగా (లక్షాధికారులుగా) చేస్తామని పేర్కొంది. ‘సంకల్ప్ పత్ర్’ పేరుతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం పాట్నాలో ఎన్డీయే మేనిఫెస్టోను విడుదల చేశారు. 

కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి కోసం రాష్ట్ర యువత వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతోందని, వలసలను కట్టడి చేసేందుకు కోటి ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ నిర్వహించి యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తామన్నారు. 

అలాగే పీఎం ఆవాస్ యోజన కింద 50 లక్షల పక్కా ఇండ్లు కట్టిస్తామని, అర్హులకు ఉచిత రేషన్ అందిస్తామని, ప్రతి నెలా 125 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. సామాజిక భద్రత కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం చేయిస్తామని వెల్లడించారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని కూటమి నేతలు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తమ కూటమి మళ్లీ గెలిస్తే.. చీఫ్​మినిస్టర్ విమెన్స్ ఎంప్లాయ్ మెంట్ పథకం కింద మహిళలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. కోటి మంది మహిళలను ‘లఖ్ పతి దీదీ’లుగా చేస్తామన్నారు. ఇక రైతులకు కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్  నిధి కింద అన్ని పంటలకు రూ.3 వేల ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) చెల్లిస్తామని చెప్పారు.

దీంతో రైతులకు అందే సాయం ప్రస్తుతం ఉన్న రూ.6 వేల నుంచి రూ.9 వేలకు చేరుతుందన్నారు. అలాగే, మత్య్సకారులకు సాయాన్ని రూ.4500 నుంచి రూ.9 వేలకు పెంచుతామని తెలిపారు. కాగా, పేద కుటుంబాల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తామని కూటమి నేతలు పేర్కొన్నారు.