మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ తో ద్రౌపది ముర్ము భేటీ

మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ తో ద్రౌపది ముర్ము భేటీ

NDA కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో విడివిడిగా భేటీ అయ్యారు.

రాష్ట్రపతిగా అవకాశం కల్పించినందుకు ద్రౌప‌ది ముర్ము మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు ద్రౌపది ముర్ము ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వర్‌లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుంచి విమానంలో బ‌య‌లుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ బీజేపీ ముఖ్య నేతలు ఆమెకు విమనాశ్రయంలో స్వాగతం పలికారు. శుక్రవారం (జూన్ 24న) నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో గురువారం ఆమె భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ద్రౌపదితో సమావేశమైనట్లు ప్రధాని స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాల వారూ ప్రశంసించారని చెప్పారు. 

ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపాదించారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి  ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలు, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉద‌యం 11.30 గంట‌ల‌కు నామినేష‌న్ వేయ‌నున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక జూలై 18న జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు ఈ నెల‌ 29 చివ‌రి తేదీ. ఈ ఎన్నిక ఫ‌లితాలను జూలై 21న వెల్లడిస్తారు.