- అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార కూటమి గెలుపు
- మహాఘట్ బంధన్‌కు చుక్కెదురు.. 35 స్థానాలకే పరిమితం
- ఎన్నికల్లో ప్రభావం చూపని పీకే జన్ సురాజ్ పార్టీ
- 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. జేడీయూకు 85 సీట్లు
- 19 సీట్లు గెలుచుకుని సత్తా చాటిన ఎల్జేపీ (రామ్ విలాస్)
- 25 వద్దే ఆగిపోయిన ఆర్జేడీ.. కాంగ్రెస్‌కు 6 స్థానాలు
- 5 స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలో మరోసారి ‘నిమో(నితీశ్–మోదీ)’ హవాతో అధికార కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసినట్టే.. బిహార్ ఓటర్లు ఎన్డీయేకు బంపర్ మెజార్టీతో మరోసారి అధికారాన్ని అప్పగించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఏకంగా 202 సీట్లను కట్టబెట్టారు. మొత్తం 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీకి ఈ నెల 6, 11న రెండు విడతల్లో పోలింగ్ జరగగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టిన ఎన్నికల సంఘం(ఈసీ) ఫలితాలను ప్రకటించింది.
ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ (122)ను దాటి ఏకంగా 80 సీట్లను అధికంగా గెలుచుకుంది. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమి ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 35 సీట్లకే పరిమితమైపోయింది. ప్రచారంలో ఎంతో హైప్ సృష్టించిన జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) చీఫ్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు.
రాష్ట్రంలో 10% అధికంగా ఉన్న మహిళా ఓటర్లు ఎన్డీయే వైపు మొగ్గుచూపడం వల్లే ఇంతటి భారీ విజయం దక్కినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో విజయాల తర్వాత బీజేపీకి ఇది గ్రాండ్ విక్టరీగా నిలిచింది. మరో ఆరు నెలల్లో బెంగాల్, అస్సాంలలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ గెలుపు ఎన్డీయేకు ఎంతో బలాన్ని చేకూర్చినట్టయింది.
అతిపెద్ద పార్టీగా బీజేపీ
ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్ల చొప్పున పోటీ చేశాయి. బీజేపీ 89 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత జేడీయూ 85 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్డీయే కూటమిలోని ఎల్జేపీ(ఆర్వీ) కూడా సత్తా చాటింది. ప్రధాని మోదీకి హనుమంతుడినని చెప్పుకొనే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఈ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేసి, ఏకంగా19 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్తానీ అవామ్ మోర్చా, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా చెరో 6 సీట్లలో పోటీ చేయగా.. 5, 4 చొప్పున సీట్లు గెలుచుకున్నాయి.
మూడోస్థానానికి ఆర్జేడీ
ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని ధీమాతో ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు చుక్కెదురైంది. మొత్తం 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసినా 6 సీట్లనే గెలుచుకోగలిగింది. మహాఘట్ బంధన్‌లోని సీపీఐ(ఎంఎల్) (ఎల్) 2 సీట్లను, సీపీఎం, ఐఐపీ చెరొక సీటును గెలుపొందాయి. కాగా, సీఎం నితీశ్ కేబినెట్లోని 29 మంది మంత్రుల్లో ఒక్కరు మినహా మిగతా వారంతా గెలిచారు.
ఓట్ షేరింగ్‌లో ఆర్జేడీ టాప్
బిహార్‌లో తేజస్వీ యాదవ్ నేతృత్వం వహిస్తున్న ఆర్జేడీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నప్పటికీ.. బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2010 తర్వాత ఆర్జేడీకి దారుణమైన పరాభవం ఎదురైంది. ఓట్ షేరింగ్‌లో మాత్రం 22.79 శాతంతో టాప్‌లో నిలిచింది. బీజేపీకి 20.52 శాతం, జేడీయూకు 18.99 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఎక్కువ మంది ఓటర్ల మద్దతు పొందిన అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆ తర్వాత 8.76 శాతం ఓట్లతో కాంగ్రెస్ 4వ స్థానంలో నిలిచింది. లోక్‌జనశక్తి పార్టీ రాం విలాస్ (ఎల్జేపీ ఆర్వీ)కు 5.02 శాతం ఓట్లతో 5వ స్థానాని కైవసం చేసుకున్నది. ఆ తర్వాత సీపీఐ(ఎంఎల్)కు 2.93 శాతం, ఎంఐఎంకు 1.97 శాతం, బీఎస్పీకి 1.56 శాతం ఓట్లు పడ్డాయి. మహాఘట్ బంధన్‌లో భాగంగా ఆర్జేడీ మొత్తం 143 స్థానాల్లో పోటీ చేసింది.
5 సెగ్మెంట్లలో మజ్లిస్ గెలుపు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మొత్తం 32 స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్1.85% ఓట్ షేర్ సాధించింది. 2020 ఎన్నికల్లోనూ ఎంఐఎం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవగా, వారిలో నలుగురు ఆర్జేడీలో చేరారు. పార్టీలో మిగిలిన ఏకైక ఎమ్మెల్యే అభ్యర్థి అక్తరుల్ ఇమాన్ ఈ సారి కూడా తన అమౌర్ సిట్టింగ్ స్థానంలో గెలుపొందారు.
బీజేపీ, జేడీయూ సంబరాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో పాట్నాలోని బీజేపీ, జేడీయూ ఆఫీసుల వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ నివాసం ఎదుట ఆయనను టైగర్‌గా అభివర్ణిస్తూ.. ‘‘టైగర్ అభీ జిందా హై’ అంటూ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దిలీప్ జైస్వాల్ స్పందిస్తూ.. నితీశ్ కుమార్ టైగర్ కంటే ఎక్కువేననన్నారు.
