
- 75 లక్షల మంది అకౌంట్లలో డబ్బులు జమ
- వివిధ దశల్లో రూ.2 లక్షల వరకు సాయం
- ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని
- మహిళలకు నితీశ్‌తో పాటు నేను అండగా ఉంటా: మోదీ
- ఆర్జేడీ, దాని కూటమిని రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వొద్దని వ్యాఖ్య
పాట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళల కోసం ఎన్డీయే కూటమి సర్కారు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ స్కీమ్ కింద 75 లక్షల మంది ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ. 10 వేలు జమచేసింది. ఈ పథకాన్ని ఢిల్లీనుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్, మంత్రులు పాల్గొన్నారు. ఈ స్కీమ్ కోసం నితీశ్ సర్కారు రూ.7,500 కోట్లు కేటాయించింది. తర్వాత వివిద దశల్లో సాయాన్ని రూ. 2 లక్షల వరకు అందించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించడం దీని ఉద్దేశమని, స్వయం ఉపాధి కోసం పశుపోషణ, వ్యవసాయం, టైలరింగ్ వంటి రంగాల్లో ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.
ఈ స్కీమ్ విజన్ నన్ను ఆకట్టుకున్నది: మోదీ
ఈ నవరాత్రి సందర్భంగా బిహార్ మహిళల సంతోషంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. వారి ఆశీర్వాదాలు తమకు గొప్ప బలం అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ లబ్ధిదారుగా ఉండే ఈ స్కీమ్ విజన్ తనను ఆకట్టుకున్నదని చెప్పారు. ఈ సాయంతో బిహారీ మహిళలు కిరాణా దుకాణాలు, స్టీల్ సామాగ్రి, కాస్మొటిక్స్, టాయ్, స్టేషనరీ షాపులను తెరవొచ్చని చెప్పారు. పశువులు, కోళ్ల పెంపకంలాంటి వ్యాపారాలను చేయొచ్చని అన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణను కూడా ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు.
‘‘బిహార్ మహిళలకు ఇప్పుడు ఇద్దరు అన్నలున్నారు. వారు నితీశ్, మోదీ” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి కృషిచేస్తామని చెప్పారు. ఆర్జేడీ హయాంలో రాష్ట్రంలోని మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ‘‘ప్రధాని మోదీ మీ కోసం పనిచేస్తున్నారు. గత సర్కారు (ఆర్జేడీ) కేవలం సొంత కుటుంబం కోసమే పనిచేసింది. లాలూప్రసాద్ యాదవ్ పదవి కోల్పోతే సతీమణిని సీఎం చేసుకున్నారు. కేవలం తన ఫ్యామిలీ కోసమే ఆందోళన చెందారు. కానీ మేం ప్రజల కోసమే పనిచేస్తం” అని చెప్పారు. రాష్ట్రంలో ఆర్జేడీ, దాని కూటమిని అధికారంలోకి రాకుండా చూడాలని ప్రజలను కోరారు.