సహకరిస్తామన్నం.. వాళ్లే స్పందించలే: రాహుల్ గాంధీ

సహకరిస్తామన్నం.. వాళ్లే స్పందించలే: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరిస్తామని ప్రతిపక్ష కూటమి చెప్పినా ఎన్డీయే కూటమి నేతలు స్పందించలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్​ సింగ్, కిరణ్ రిజిజు తమ పార్టీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారని చెప్పారు. 

స్పీకర్ ఎన్నికకు సహకరించాలని కోరగా.. సభా సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇస్తే తప్పకుండా సహకరిస్తామని తెలిపామన్నారు. దీంలో మళ్లీ ఫోన్ ద్వారా సంప్రదిస్తామని చెప్పిన రాజ్ నాథ్, రిజిజులు ఇప్పటి వరకూ ఫోన్ చేయలేదన్నారు. దీంతో చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె.సురేశ్​ను స్పీకర్ బరిలో నిలబెట్టామని రాహుల్ గాంధీ చెప్పారు. 

సభా సంప్రదాయాలను ఎన్డీయే సర్కార్ అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా మోదీ లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ ఎంపిక విషయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు తామంతా ముందుకొచ్చినా.. ఎన్డీయే ప్రభుత్వమే తమకు సహకరించడంలేదని విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ లేకుండానే గతంలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగించారన్నారు.

మేం ప్రతిపక్ష ఎంపీకే ఇచ్చాం: కాంగ్రెస్

ప్రతిపక్షాలు కోరకముందే బాధ్యతాయుతంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయే ప్రభుత్వం ఇవ్వాలని, కానీ.. అలా జరగడం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ అన్నారు. 2014లో డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వలేదని, 2019లో ఆ పోస్టు భర్తీ చేయకుండానే కొనసాగించారన్నారు. మన్మోహన్ సింగ్, వాజ్​పేయి, పీవీ హయాంలో ప్రతిపక్ష ఎంపీనే డిప్యూటీ స్పీకర్​గా ఉన్నారన్నారు.