ఇయ్యాల ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఇయ్యాల ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశంలో పాల్గొని ఎన్డీయే కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీయే కూటమికి చెందిన ఎంపీలను ఉద్దేశించి ఆయన చేసే మొదటి ప్రసంగం ఇది. ఈ మేరకు సమావేశం గురించి బీజేపీ, దాని మిత్రపక్షాల పార్లమెంటు సభ్యులందరికీ సమాచారం ఇచ్చారు.

మీటింగ్​కు అందరూ హాజరు కావాలని అధికార వర్గాలు తెలిపాయి. 2014 తర్వాత తొలిసారిగా బీజేపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో లోక్‌‌సభలో మెజారిటీని కోల్పోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు దాని మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. బీజేపీ 240 సీట్లు గెలుచుకోగా.. దాని మిత్రపక్షాలు 53 గెలుచుకున్నాయి. దీంతో 543 మంది సభ్యుల సభలో ఎన్డీయే సగం మార్కును సునాయాసంగా దాటింది.