ఇయ్యాల తెలంగాణకి ఎన్​డీఎస్ఏ కమిటీ

ఇయ్యాల తెలంగాణకి ఎన్​డీఎస్ఏ కమిటీ
  •     మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం
  •     రీసెర్చ్ ల్యాబ్​లో ప్రాజెక్ట్​ల రన్నింగ్ మోడల్స్ పరిశీలించనున్న కమిటీ
  •     అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశం

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మరోసారి రాష్ట్రానికి రానున్నది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు అధికారులతో సమావేశమై మేడిగడ్డ డ్యామేజ్​కు సంబంధించిన వివరాలను తెలుసుకోనున్నది.

హైదరాబాద్, వెలుగు: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) నిపుణుల కమిటీ మరోసారి రాష్ట్రానికి రానున్నది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఇరిగేషన్ అధికారులతో సమావేశమై మేడిగడ్డ డ్యామేజ్​కు సంబంధించిన వివరాలను తెలుసుకోనున్నది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ.. ఇప్పటికే ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించింది. ఈ నెల 9న సెంట్రల్ డిజైన్స్ ఆఫీస్​, క్వాలిటీ కంట్రోల్ సహా వివిధ విభాగాల ఇంజినీర్ల నుంచి విడివిడిగా ఇన్ఫర్మేషన్​ తీసుకున్నది. 

అయితే, కీలకమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో మాత్రం టైమ్ లేకపోవడంతో భేటీ కాలేదు. ఈ క్రమంలోనే బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఓ అండ్ ఎం అధికారులతో పాటు పలువురు ఇంజనీర్లతో సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇరిగేషన్ సెక్రటరీ, అధికారులకు ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. 

ఇంతకుముందు మీటింగ్ జరిగిన అధికారు కూడా అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులతో నిపుణుల కమిటీ భేటీ అవుతుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా మరోసారి భేటీ అయి ప్రాజెక్ట్ వివరాలు సేకరించనున్నది. శుక్రవారం స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీకి వెళ్లి ప్రాజెక్టులు, డ్యాముల, బ్యారేజీల రన్నింగ్ మోడల్స్​ను పరిశీలించనున్నది. అదే రోజు రాత్రి తిరిగి నిపుణుల కమిటీ ఢిల్లీకి వెళ్లిపోతుంది.