రంగంలోకి దిగిన ఏఐ.. ఒక్క నెలలోనే 4వేల జాబ్స్ కట్.. ఇప్పుడే ఇలా ఉంటే...

రంగంలోకి దిగిన ఏఐ.. ఒక్క నెలలోనే 4వేల జాబ్స్ కట్.. ఇప్పుడే ఇలా ఉంటే...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పలు రంగాల్లోని ఉద్యోగులకు ముప్పుందని కొన్ని రోజుల నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మేలో ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితా వచ్చేసింది. సుమారు 4వేల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తమ ఉద్యోగాలు కోల్పోయారని ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ నెలవారీ నివేదిక వెల్లడించింది.

3900 మంది తొలగింపులకు ఏఐ కారణమని యూఎస్ యజమానులు పేర్కొన్నారని, ఇది మే నెలలో జరిగిన ఉద్యోగాల కోతలో దాదాపు 4.9% అని సంస్థ తెలిపింది. జూన్ 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం జనవరి, మే మధ్య, సుమారు 4,17,500 ఉద్యోగాలు కోల్పోయారు. గత నెలలో (మే లో)80వేల మంది ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో ఏఐ కారణంగా దాదాపు 4 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. ఖర్చుల్లో కోత, మాంద్యం పరిస్థితులు వంటి కారణంగా వారు ఉద్యోగాలు కోల్పోయినట్లుగా తెలిపింది.

టెక్ ప్రపంచంలో ఎంతో కష్టమైన పనుల్ని సైతం ఏఐ టూల్స్ అవలీలగా చేస్తుండడం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. అది క్రమంగా మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందన్న వార్తలకు సాక్ష్యంగా నిలుస్తోన్న ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ.. నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే.. ఏఐ కారణంగా రానున్నరోజుల్లో ఉద్యోగులు ఏ స్థాయిలో నష్టపోతాయన్నది అంచనాలకు అందకుండా ఉంది.