మహిళలకు గ్రూప్ 1లో సగం పోస్టులు

మహిళలకు గ్రూప్ 1లో సగం పోస్టులు
  • కొత్త రోస్టర్ విధానంతో పెరిగిన మహిళా కోటా 
  • మొత్తం పోస్టుల్లో జనరల్ 278, విమెన్​కు 225
  • ఈడబ్ల్యూఎస్ కోటాలో 43, స్పోర్ట్స్ కోటాలో ఒక్కటే 
  • ఏడు లోపు ఎక్కడ చదివితే అక్కడ్నే లోకల్ 
  • కొత్త రోస్టర్ పై పలువురు అభ్యర్థుల నిరాశ 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1లో దాదాపు సగం పోస్టులు మహిళలకు కేటాయించారు. కొత్త రోస్టర్ విధానం అమలు చేస్తుండడంతో వాళ్లకు పోస్టులు భారీగా పెరిగాయి. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో కొత్త  జోనల్ విధానంతో పాటు కొత్త రోస్టర్ విధానాన్ని టీఎస్​పీఎస్సీ అమలు చేస్తోంది. అయితే మొత్తం పోస్టులను పరిగణనలోకి తీసుకోకుండా, ఒక్కో డిపార్ట్​మెంట్​ను ఒక్కోయూనిట్​గా భావించి కొత్త రోస్టర్ అమలు చేస్తోంది. దీంతో మొత్తం 503 పోస్టుల్లో 278 జనరల్, 225 మహిళలకు అలాటయ్యాయి. ప్రతి పోస్టులోనూ కొత్త రోస్టర్ విధానాన్ని అమలు చేస్తుండటంతోనే మహిళా కోటా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కొత్త రోస్టర్​అమలుతో కొన్ని కేటగిరీల్లో పోస్టులే లేకుండా పోవడం, కొన్ని కేటగిరీలకు తక్కువ పోస్టులు రావడంతో ఆయా కేటగిరీల అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. బీసీలకు అన్యాయం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

16 బ్యాక్​లాగ్ పోస్టులు... 

తొలిసారి గ్రూప్1 పోస్టుల భర్తీలో ఈడబ్ల్యూఎస్ కోటా (10%) అమలు చేస్తున్నారు. దీంతో అగ్రవర్ణ పేదలకు మేలు జరగనుంది. ఈ కోటాలో జనరల్​ కేటగిరీలో 30, ఉమెన్స్ కేటగిరీలో 13 పోస్టులు ఉన్నాయి. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ –డీ, బీసీ–ఈ, ఎస్టీ తదితర కేటగిరీల కంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోనే ఎక్కువ పోస్టులు ఉండడం గమనార్హం. దీనికి రోస్టర్ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్ 9వ నెంబర్​లో ఉండడమే కారణం. మరోపక్క తొలిసారిగా అమలు చేస్తున్న స్పోర్ట్స్ కోటా( 2%)లో ఒకే ఒక్క పోస్టు ఉంది. దీన్ని మల్టీజోన్​1లో ఎంపీడీఓ పోస్టుకు ఉమెన్స్​కేటగిరీలో కేటాయించారు. కాగా, మొత్తం 503 పోస్టుల్లో 16 బ్యాక్ లాగ్​ పోస్టులు ఉన్నాయి. 

కీలకంగా మారిన లొకాలిటీ... 

కొత్త జోనల్ విధానం ప్రకారం 95% పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయనున్నారు. దీంతో గ్రూప్​1 పోస్టుల భర్తీలో లొకాలిటీ కీలకంగా మారింది. ఏడో తరగతి లోపు ఎక్కడ చదివితే, అదే జిల్లా లోకల్​గా భావిస్తామని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. అందులోనూ నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పరిగణనలోకి తీసుకోనుంది. ఈ నాలుగు తరగతులు ఎక్కడ చదివితే, ఆ ప్రాంతమే లోకల్​ ఏరియాగా గుర్తిస్తారు. అయితే ఇవి మల్టీజోన్ పోస్టులు కాబట్టి.. రాష్ట్రంలో ఏ మల్టీజోన్​ పరిధిలో చదివితే, ఆ ప్రాంతంలోనే లోకల్​గా మారుతారు.