బీఎస్పీలోకి నీలం మధు... భారీ ర్యాలీతో నామినేషన్

బీఎస్పీలోకి నీలం మధు... భారీ ర్యాలీతో నామినేషన్

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ మారాయి. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు ముదిరాజ్.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. టికెట్ ఇలా వచ్చిందో లేదో... కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిని మర్చింది. దీంతో ఆయన చివరకు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీ తరపున పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు నీలం మధు వెళ్లారు.

పటాన్ చెరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్‌ను కేటాయించింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో అసంతృప్తికి గురైన నీలం మధు ఆ పార్టీని వీడారు. టికెట్ పై కాంగ్రెస్‌ నుంచి హామీ లభించడంతో కొద్దిరోజుల క్రితం ఆ పార్టీలో చేరారు. అయితే.. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనకు టికెట్‌ ఇచ్చినట్లే ప్రకటించి మళ్లీ పెండింగ్‌లో పెట్టింది. 

నీలం మధుకు టికెట్‌ ప్రకటించడాన్ని పటాన్‌చెరుకు చెందిన కాంగ్రెస్‌ నేత, టికెట్‌ ఆశావహుడు కాటా శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి నుంచి పార్టీలో కష్టపడిన తమకు కాకుండా కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్‌ ఖరారు చేయడమేంటని పార్టీ పెద్దలను నిలదీశారు. ఈ క్రమంలో గాంధీభవన్‌ వద్ద శ్రీనివాస్‌ అనుచరులు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో నీలం మధుకు కాంగ్రెస్‌ బీఫామ్‌ దక్కలేదు. ఆ తర్వాత గురువారం (నవంబర్ 9న) రాత్రి ప్రకటించిన జాబితాలో పటాన్‌చెరు టికెట్‌ను నీలం మధు స్థానంలో కాటా శ్రీనివాస్‌కు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్‌ చెప్పింది. 

నమ్మించి మోసం చేశారంటూ కాంగ్రెస్‌ పెద్దలపై మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని.. కాంగ్రెస్‌ను ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. శుక్రవారం (నవంబర్ 10న) ఉదయం పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌.. నీలం మధును కలిసి ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. అందుకు నిరాకరించిన మధు.. చివరికి బీఎస్పీలో చేరారు. దీంతో ఆ పార్టీ ఆయనకు బీఫామ్‌ ఇచ్చింది.