బీఆర్ఎస్కు నీలం మధు రాజీనామా

బీఆర్ఎస్కు నీలం మధు రాజీనామా
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటన
  • కొత్తపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం

పటాన్ చెరు, వెలుగు: పటాన్​చెరు నియోజక వర్గం నుంచి బీఆర్​ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు ఆ పార్టీకి రాజీనామ చేశారు. సోమవారం గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో తన రాజీనామాను ప్రకటించారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు. బహుజన జాతి బిడ్డలు చట్టసభల్లో అడుగుపెడితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. 

మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని.. ఆశీర్వదించి ఆత్మగౌరవాన్ని గెలిపించాలని కోరారు. అలాగే కొత్తపల్లి లో పాదయాత్రను ప్రారంభించి కొత్తపల్లి తండా, లక్ష్మాపూర్​, లక్ష్మాపూర్​ తండా, నాగిరెడ్డి గూడెం, ప్యారానగర్, మంబాపూర్లలో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. పటాన్​చెరు నియోజకవర్గంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, కార్యకర్తలకు ప్రజలకు కనీస విలువలేదని మధు ఆరోపించారు. 

బీఆర్ఎస్లో బీసీ బిడ్డలకు గుర్తింపు లేదని, అడుగడుగునా తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22 ఏండ్లుగా బీఆర్​ఎస్​కోసం ఒక సైనికుడి లాగా పనిచేసినా పార్టీ కనీసం గుర్తించకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.