
బెంగళూరు: ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా తన కెరీర్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. తన పేరిట ఇండియాలో ఒక ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఈవెంట్ నిర్వహించిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో శనివారం జరిగిన ఎన్‌సీ క్లాసిక్ (నీరజ్ చోప్రా క్లాసిక్ 2025) జావెలిన్ పోటీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చోప్రా గోల్డ్ మెడల్ నెగ్గి తన ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నాడు.
స్వీడన్ లెజెండరీ పోల్‌వాల్టర్ డుప్లాంటిస్, కెన్యా లెజెండరీ రన్నర్ కిప్చొగె కైనో పేర్ల మీద ఉన్న ఈవెంట్‌ల స్ఫూర్తితో నీరజ్ దీన్ని ప్రారంభించాడు. దీనికి వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపును ఇచ్చింది. దాంతో డుప్లాంటిస్ మాదిరిగా ఒక అథ్లెట్ పేరుతో ఒకే ఆట (జావెలిన్)తో ఇంటర్నేషనల్ ఈవెంట్ నిర్వహించి రికార్డు సృష్టించిన చోప్రా తన కల నెరవేర్చుకున్నాడు. 12 మంది అథ్లెట్ల బరిలో నిలిచిన పోటీలో నీరజ్ అత్యధికంగా 86.18 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి టాప్ ప్లేస్‌తో బంగారు పతకం కైవసం చేసుకోగా.. కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 మీటర్లతో రజతం గెలుచుకున్నాడు . శ్రీలంక అథ్లెట్ రుమేష్ పతిరాగే (84.34 మీ) కాంస్యం నెగ్గాడు.