పంజాగుట్ట, వెలుగు: నీట్‌పరీక్షను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ నేతలు రాజ్‌భవన్ ను ముట్టడించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలు రాజ్ భవన్ ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని నీట్సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
