- పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ముషీరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని, పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంటులో నీట్ పరీక్ష విధానంపై 24 గంటల చర్చ పెట్టాన్నారు. నీట్ పరీక్షను రద్దు చేస్తారో లేదా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తారో మోదీ తేల్చుకోవాలన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వం నిర్వహించేది మన్ కి బాత్ కాదని.. బాతకాని బాత్ అని ఎద్దేవా చేశారు. కుల గణనా చేయమంటే.. దేశ సమగ్రత దెబ్బతింటుందని చెబుతున్నారని విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. జవాబుదారీతనం లేకుండా నీట్ పరీక్షను నిర్వహించారని ఎమ్మెల్సీ బల్కూరి వెంకట్ ఆరోపించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ జరిగిందని విమర్శించారు.
లీకేజీ కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గొడుగు మహేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ నాయకులు డాక్టర్ తాటికొండ విక్రం గౌడ్, శ్యాం కురుమ,డాక్టర్ విజయభాస్కర్, వివిధ సంఘాల విద్యార్థి నాయకులు డాక్టర్ నరసింహ నాయక్, అరుణ్ కుమార్, ఆజాద్, లింగం గౌడ్, సట్టా లక్ష్మణ్, జాజుల లింగం తదితరులు మాట్లాడారు.
