వచ్చే నెలలోనే నీట్, జేఈఈ

వచ్చే నెలలోనే నీట్, జేఈఈ

స్టూడెంట్ల కెరీర్‌‌‌‌ను రిస్క్ లో పడేయలేం

నీట్, జేఈఈ వాయిదాకు సుప్రీంకోర్టు నో

న్యూఢిల్లీ: నీట్, జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జాంలను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు నో చెప్పింది. స్టూడెంట్ల కెరీర్ ను ప్రమాదంలో పడేయలేమని, ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే నీట్ ఎగ్జాం సెప్టెంబర్ 13న, ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం చేపట్టే జేఈఈ ఎగ్జాం సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జరగనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ 11 రాష్ట్రా లకు చెందిన 11మంది స్టూ డెంట్లు దాఖలుచేసిన పిటిషన్ ను కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది.

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ‘‘స్టూ డెంట్లు మొత్తం ఏడాదిని వేస్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? కరోనా ఇంకో ఏడాది కూడా కొనసాగొచ్చు. మరో ఏడాది దాకా వెయిట్ చేయాలని అనుకుంటున్నారా? దేశం, స్టూడెంట్లు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారో మీకు తెలుసా?’’ అని పిటిషనర్లను జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రీ జడ్జ్ బెంచ్ ప్రశ్నించింది. మళ్లీ నార్మల్ పరిస్థితులు ఏర్పడ్డా కే ఎంట్రెన్స్ ఎగ్జాంలు పెట్టేలా అధికారులను ఆదేశించాలంటూ స్టూడెంట్ల అడ్వకేట్ అలోక్ శ్రీవాస్తవ కోరారు. దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ ఎగ్జాం సెంటర్లను కూడా పెంచాలని విన్నవించారు. అయితే ఎగ్జాంల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు . దీంతో పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.