మైనస్ మార్కులొచ్చినా పీజీ సీటా? : తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్

మైనస్ మార్కులొచ్చినా పీజీ సీటా? : తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్
  •     కేంద్రానికి తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ ​ఘాటు లేఖ 
  •     నీట్ పీజీ జీరో కటాఫ్నిర్ణయంపై ఆగ్రహం 
    ​ 
  •     ప్రైవేటు కాలేజీల కోసమేనంటూ ఫైర్

హైదరాబాద్, వెలుగు: నీట్ పీజీ-2025–26 ప్రవేశాల్లో కటాఫ్ పర్సంటైల్​ను జీరోకు తగ్గించడంపై తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-ఎస్ఆర్‌‌డీఏ) భగ్గుమంది. ఈ నిర్ణయం వైద్య విద్యను భ్రష్టు పట్టించేలా ఉందని, తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనాద్, కర్షిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు బుధవారం లేఖ రాశారు. 

కేవలం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని, దీనివల్ల మైనస్ 40 మార్కులు వచ్చిన వారు కూడా స్పెషలిస్ట్ కోర్సుల్లో చేరే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కష్టపడి చదివిన మెరిట్ విద్యార్థులను అవమానించడమేనని మండిపడ్డారు. 

అర్హతలేని వారికి పీజీ సీట్లు కట్టబెడితే భవిష్యత్తులో నాణ్యమైన వైద్యులు ఉండరని, ఇది నేరుగా ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తుందని టీ-ఎస్ఆర్‌‌డీఏ హెచ్చరించింది. వైద్య వృత్తి పవిత్రతను, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ నోటిఫికేషన్‌‌ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. మెరిట్ ఆధారిత కటాఫ్‌‌ ను పునరుద్ధరించకపోతే.. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ)తో కలిసి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రెసిడెంట్ డాక్టర్లు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.