నీట్ ను రద్దు చేయండి: ప్రొఫెసర్ హరగోపాల్

నీట్ ను రద్దు చేయండి:  ప్రొఫెసర్ హరగోపాల్

బషీర్ బాగ్, వెలుగు:  పరీక్షల వ్యవస్థ విశ్వసనీయతను కోల్పోతే  విద్యావ్యవస్థ కుప్పకూలుతుందని, ప్రస్తుతం దేశం అదే ఎదుర్కొంటుందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జి. హరగోపాల్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ తో 23 లక్షల మంది విద్యార్థుల కష్టం వృథా అయిందన్నారు. క్వశ్చర్ పేపర్ అమ్ముకొని, ఏండ్లుగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు,  ఒకే సెంటర్ లో 6 మందికి వందశాతం మార్కులు రావడంతో అవకతవకలు జరిగాయని, నీట్ ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో  తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొ. కె. చక్రధర్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొ.కె లక్ష్మినారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. 

కేంద్రీకృత పరీక్ష విధానాలను రద్దు చేసి రాష్ట్రాలకు, యూనివర్సిటీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రీకృత పరీక్షలకు మూల కారణమైన జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించి, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఒక విద్యా విధానాన్ని తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో రోజు రోజుకు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గిపోతుందని, దీనికి ప్రధానమైన కారణం మౌలిక వసతులు, టీచర్ల కొరత ఉందన్నారు. ఇలాంటి కారణాలను అర్ధం చేసుకొని ఆగస్టు 15లోగా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.