నీట్ రీ ఎగ్జామ్ టైం పెంపు .. 195 నిమిషాలకు పెంచిన ఎన్టీఏ

నీట్ రీ ఎగ్జామ్ టైం పెంపు .. 195 నిమిషాలకు పెంచిన ఎన్టీఏ
  • విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు
  • 195 నిమిషాలకు పెంచిన ఎన్టీఏ

హైదరాబాద్, వెలుగు: జూన్ 21న జరగనున్న నీట్ (యూజీ)-–2026 రీ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్ష సమయాన్ని  మరో 15 నిమిషాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో పరీక్ష సమయంలో అటెండెన్స్ షీట్లపై సంతకాలు చేయడం, ఇతర ఇన్విజిలేషన్ ఫార్మాలిటీస్ వల్ల విద్యార్థులు తమకు కేటాయించిన అసలు సమయాన్ని కోల్పోతున్నామని ఫిర్యాదులు చేసేవారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు పరీక్ష సమయాన్ని ఏకంగా 180 నిమిషాల నుంచి195 నిమిషాలకు పెంచారు. దీని ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది. గతంలో ఉన్న సమయం కంటే 15 అదనపు నిమిషాలను కేటాయించడం ద్వారా, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియల వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినకుండా, ఎగ్జామ్ మీదే దృష్టి పెట్టేలా వెసులుబాటు కల్పించినట్టు ఎన్టీఏ స్పష్టం చేసింది.

మరోవైపు క్వశ్చన్ పేపర్ బుక్‌‌ లెట్ డిజైన్‌‌ లోనూ అభ్యర్థుల సౌకర్యార్థం ఎన్టీఏ కీలక మార్పులు చేసింది. గతంలో రఫ్ వర్క్ కోసం కేవలం రెండు పేజీలు మాత్రమే ఉండటంతో పాటు, అవి బుక్‌‌ లెట్ చివరలో అందుబాటులో ఉండేవి. దీనివల్ల ఎడమ చేతి వాటం కలిగిన అభ్యర్థులు లెక్కలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే, తాజా మార్పులతో రఫ్ పేజీల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచడమే కాకుండా, వాటి అమరికలోనూ మార్పు చేశారు. ఇప్పుడు రెండు రఫ్ పేజీలను ఇన్‌‌ స్ట్రక్షన్ పేజీ తర్వాత బుక్‌‌ లెట్ ప్రారంభంలోనే కేటాయించగా, మిగిలిన రెండు పేజీలను చివరలో ఉంచారు.