హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో బిడ్డకు కాన్పు చేసిన తల్లి

హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో బిడ్డకు కాన్పు చేసిన తల్లి

పెనుబల్లి (ఖమ్మం), వెలుగు: పురిటి నొప్పులతో బాధపడుతూ డెలివరీ కోసం కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు వచ్చిన గర్భిణి పట్ల వైద్య సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. డెలివరీ చేసేందుకు గర్భిణి తరఫు నుంచి ఆడోళ్లు లేరంటూ లేబర్​ రూమ్​ నుంచి ఆమెను జనరల్ వార్డుకు షిఫ్ట్​ చేశారు. తర్వాత లేబర్​ రూమ్​కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో జనరల్​ వార్డులోనే బిడ్డకు తల్లి కాన్పు చేసింది. ఈ ఘటన బుధవారం రాత్రి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్​లో జరిగింది. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన కన్నెకంటి రజిత పురిటి నొప్పులతో బుధవారం ఉదయం తన భర్త, తల్లితో కలిసి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు వచ్చింది. పరీక్షించిన డాక్టర్లు.. డెలివరీ అయ్యే చాన్స్​ ఉందని, వెంటనే అడ్మిట్ చేయాలని సూచించారు.

 దీంతో రజితను హాస్పిటల్​లో అడ్మిట్ చేశారు. అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో.. నార్మల్ డెలివరీ అయ్యేందుకు వాకింగ్ చేయాలని హాస్పిటల్ సిబ్బంది సూచించారు. బుధవారం సాయంత్రానికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. డ్యూటీలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇవ్వగా రజితను డెలివరీ కోసం లేబర్ రూమ్​కు తీసుకెళ్లారు. ఆ టైమ్​లో రజిత వెంట భర్త మాత్రమే ఉన్నాడు. ఆడవాళ్లు లేకపోతే డెలివరీ చేయమని చెప్పి రజితను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసి లేబర్ రూమ్​కు తాళం వేసుకుని సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 8 గంటల టైమ్​లో ఉమ్మ నీరు పోతుండటంతో అక్కడే ఉన్న రజిత తల్లి, మరో ఇద్దరు బంధువులతో కలిసి జనరల్ వార్డులోనే అందరి ముందు కాన్పు చేసింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రజిత తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 పడకల హాస్పిటల్​లో ఓ తల్లే.. తన బిడ్డకు కాన్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్​ను వివరణ కోరగా.. డ్యూటీ డాక్టర్ ఉన్నా.. కింది స్థాయి సిబ్బంది సమాచారం ఇవ్వలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై చార్జ్​మెమో ఇస్తామని చెప్పారు.