బ్లడ్ టెస్టులు చేయకుండానే రిపోర్టులు.. హెచ్‌‌ఐవీ, హెచ్‌‌బీఎస్‌‌ఏజీ, హెచ్‌‌సీవీ పరీక్షల్లో నిర్లక్ష్యం

బ్లడ్ టెస్టులు చేయకుండానే రిపోర్టులు.. హెచ్‌‌ఐవీ, హెచ్‌‌బీఎస్‌‌ఏజీ, హెచ్‌‌సీవీ పరీక్షల్లో నిర్లక్ష్యం
  • నెగెటివ్​ ఉన్నట్లుగా ధ్రువీకరణ.. ఆ తర్వాత పాజిటివ్​
  • మహబూబాబాద్​ జనరల్​ హాస్పిటల్​లో కాంట్రాక్ట్​ ఉద్యోగి నిర్వాకం

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్​లో రక్త పరీక్షలు నిర్వహించకుండానే నెగిటివ్ రిపోర్టులు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ కోసం వచ్చిన ఓ మహిళకు హెచ్‌‌ఐవీ, హెచ్‌‌బీఎస్‌‌ఏజీ(హెపటైటిస్​ బీ సర్ఫేస్​ యాంటిజెన్), హెచ్‌‌సీవీ(హెపటైటిస్​ సి వైరస్) వంటి వైరస్ పరీక్షలు చేయాల్సి ఉండగా, పరీక్షలు చేయకుండానే నెగిటివ్ రిపోర్టులు ఇచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు.

ఆ రిపోర్టుల ఆధారంగా సర్జికల్ విభాగం డాక్టర్లు ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు లేకుండా ఆపరేషన్ నిర్వహించారు. తరువాత ఒక నర్సింగ్ సిబ్బంది ఆ రోగికి ఇప్పటికే హెచ్‌‌బీఎస్‌‌ఏజీ ఉన్నట్లు సమాచారం ఇవ్వడంతో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. అప్పుడే ఆమెకు హెచ్‌‌బీఎస్‌‌ఏజీ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో డాక్టర్​ వైద్యాధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సంబంధిత కాంట్రాక్ట్​ ఉద్యోగిని వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది.  గతంలో కూడా ఇలాంటి తప్పుడు రిపోర్టుల ఘటనలు చోటుచేసుకున్నాయని, హెచ్‌‌ఐవీ కేసులోనూ డాక్టర్లు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

ఆపరేషన్, డయాలిసిస్ రోగుల విషయంలోనూ పరీక్షలు చేయకుండానే రిపోర్టులు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగిపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ కొందరు వైద్యాధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్‌‌రావు స్పందిస్తూ, తాను గత నాలుగు వారాలుగా హైదరాబాద్‌‌లో ట్రైనింగ్‌‌లో ఉన్నానని, విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. తప్పుడు రిపోర్టులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు.